రాష్ట్రంలో పండే పత్తికి ప్రత్యేక పేరు పెట్టి 'తెలంగాణ బ్రాండ్'తో విక్రయించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో వస్త్ర (స్పిన్నింగ్) మిల్లుల పత్తి కొనుగోలు విధానంపై అక్కడి నిపుణులతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడారు. తెలంగాణలో పండిన పత్తిని మార్కెట్‌లో విక్రయించడంలో ఎదురవుతున్న సమస్యలనూ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో 400 వరకూ విత్తన కంపెనీలు అనేక రకాల పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నాయి. ప్రధాన కంపెనీల విత్తనాలతో పండే పంట నుంచే నాణ్యమైన దూది వస్తోంది. కొందరు వ్యాపారులు నాసిరకం, అనుమతి లేని పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. వీటి నుంచి పొట్టిరకం, నాణ్యతలేని దూది వస్తోంది. దీన్ని కొనేందుకు వస్త్ర మిల్లులు ఆసక్తి కనబర్చడం లేదు. పంటకు సరైన ధర ఇవ్వడం లేదు.
నాణ్యమైన విత్తనాలపై పరిశోధనలు
తెలంగాణలో రైతు నుంచి వంద కిలోల పత్తిని కొంటే జిన్నింగ్ తరవాత 28 నుంచి 32 కిలోల దూది వస్తోంది. పలు దేశాలతో పాటు గుజరాత్‌లో సైతం 35 నుంచి 40 కిలోలదాకా వస్తోంది. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలిస్తేనే అది సాధ్యమవుతుంది.
పత్తికి 'తెలంగాణ బ్రాండ్'!
పొడుగురకం నాణ్యమైన దూది వచ్చే విత్తనాలపై పరిశోధనలు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశీయ పత్తి వంగడాల్లో బీటీ జన్యువులను చొప్పించి నాణ్యమైన జన్యుమార్పిడి (జీఎం) విత్తనాల ఉత్పత్తికి పరిశోధనలు చేస్తున్నట్లు వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ పేర్కొన్నారు. నాగ్‌పుర్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన జాతీయ పత్తి సంస్థ విడుదల చేసిన కొత్త వంగడాలను తీసుకుని ఈ సీజన్‌లో సాగు చేసి విత్తనోత్పత్తి చేస్తున్నట్లు వివరించారు.
బ్రాండ్‌పై ప్రణాళిక
రాష్ట్రంలో పండే పత్తిని ప్రత్యేక బ్రాండ్ పేరుతో అమ్మేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంస్థ ప్రధాన కార్యదర్శి జి.రమేశ్ తెలిపారు. పత్తి విత్తనాలను నాటే దశ నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంçటూనే మార్కెట్‌లో మద్దతు ధర ఇప్పించడం సాధ్యమవుతుందన్నారు.