భాగ్యనగరం బాలాపూర్ మండల పరిధిలో గుర్రంచెరువు విస్తీర్ణం 40 ఎకరాలు. దీనిలో కబ్జాదారులు 3.5 ఎకరాలను ఆక్రమించారు. కొన్ని నెలలుగా చెరువు ఆక్రమణకు ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులు.. చెరువులో నీళ్లున్నా 10అడుగుల మేర మట్టి వేశారు. దీనిపై మొదట గుడారాలు, తాత్కాలికంగా షెడ్లు వేశారు. వీటిని రోహింగ్యాలకు అద్దెకిచ్చారు. కబ్జాదారులు ఆక్రమించిన భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల పైమాటే.
కట్టడాలను కూల్చి కబ్జా చేశారు..
దీనిపై స్థానికులు గతేడాది ఆగస్టులో రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. రెవెన్యూ అధికారులు.. తాత్కాలిక కట్టడాలను కూల్చేసి.. ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టి వచ్చేశారు. కొన్నాళ్లకే షెడ్లు యథావిధిగా వెలిశాయి. స్థానికులు మరోసారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు
ఉన్నతస్థాయిలో అధికారులపై ఒత్తిడి..
గుర్రం చెరువు.. బండ్లగూడ, బాలాపూర్ మండలాల పరిధిలో ఉంది. అప్పటి రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖాధికారులు వెళ్లి రోహింగ్యాలను ఖాళీ చేయాలంటూ హెచ్చరించి ఊరుకున్నారు. ఉన్నతస్థాయిలో ఒత్తిడి రావడం వల్ల రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- చెరువు పరిధి సర్వే చేసిన అధికారులు ఆక్రమణలు మినహాయించి కంచెను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదే అదునుగా తీసుకొని ఆక్రమణదారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలూ మొదలు పెడుతున్నారు.
- రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు రావడం వల్ల చాంద్రాయణగుట్ట పోలీసుల సాయంతో ప్రహరీ గోడలను కూల్చేశారు. స్థలం తనదేనంటూ వాదించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
చెరువులను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులు.. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి