నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి బాలనర్సయ్య(70) హైదరాబాద్ బండ్లగూడలో ఏడాది క్రితం కొత్తగా ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తె, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి అప్పటికే వివాహం కాగా, ముషీరాబాద్‌లోని ఓ షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు సీతారామ సాయిప్రసాద్ వర్మ(31)కు, ఏడాది క్రితం సిరి(చామంతి)తో వివాహమైంది. అందరూ అదే ఇంట్లో వేర్వేరు అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. ఆర్నెల్ల క్రితం పెద్ద కుమార్తె అనారోగ్యం బారినపడటంతో బాలనర్సయ్య స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కుమార్తెకు కరోనా సోకిందని తెలిసి ఆందోళనకు గురైన ఆయనకు అక్కడే గుండెపోటు వచ్చింది. అదే ఆస్పత్రిలో చేరిన ఆయన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. తండ్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని చిన్నకుమారుడు సీతారామ సాయిప్రసాద్‌వర్మ అప్పట్నుంచి అన్యమనస్కంగానే ఉంటున్నాడు. మానసిక స్థితి దెబ్బతిన్న ఆయనకు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించగా ఇటీవల కోలుకున్నాడు. భర్త మరణం, కుమారుడి పరిస్థితితో మానసికంగా కుంగిపోయిన బాలనర్సయ్య భార్య నాలుగు నెలలుగా పక్షవాతంతో మంచం పట్టారు.
భర్త కోలుకున్నాడనే ఆనందం.. కొన్నాళ్లే
సీతారామ సాయిప్రసాద్ వర్మ కొంతకాలంగా ఉద్యోగానికి వెళ్తుండటంతో అతని భార్య ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న ఆమె..పురుడు కోసం రెండు వారాల క్రితం రామాంతాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆమెతోపాటు అత్తారింటికి వెళ్లిన ప్రసాద్ వర్మ మంగళవారం బండ్లగూడలోని ఇంటికి వచ్చాడు. రాత్రి పైఅంతస్తులో సోదరిడితోపాటే నిద్రించాడు. అర్ధరాత్రి తర్వాత కింది అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గమనించిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న కుమారుడి మరణంతో తల్లి మరింత కుంగిపోగా, హుటాహుటిన అత్తారింటికి వచ్చిన భార్య హృదయవిదారకంగా రోదించింది. ఇదే సమయంలో పురిటినొప్పులు రావడంతో ఆమెను ఉప్పల్‌లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఉద్యోగం మానేయడం, జీతం లేకపోవడంతో బ్యాంకుల్లో చేసిన వ్యక్తిగత రుణాల భారం పెరగడం కూడా అతని ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
- ఇదీ చదవండి: పిప్రి ఎత్తిపోతల పనులు చేపట్టండి: సీఎం కేసీఆర్