కరోనా వైరస్‌పై ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్ విడుదల చేసింది. కేరళలో నమోదైన కేసు ధ్రువీకరించిన నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫీవర్, గాంధీ, ఛాతీ హాస్పిటల్ వంటి గుర్తించిన ఆసుపత్రులతో పాటు మరిన్ని ఐసోలేషన్ వార్డులను రూపొందించాలని నిర్ణయించారు.
ప్రత్యేక వార్డులు..
సరోజిని దేవి కంటి ఆసుపత్రితో పాటు అనుమానాస్పద కేసుల కోసం ప్రత్యేకంగా 200 పడకలు అందుబాటులో ఉంచారు. గురువారం సాయంత్రం వరకు తొమ్మిది మంది అనుమానితులు, మరో ఇద్దరు ఇటువంటి లక్షణాలతో ఉన్నవారిని గుర్తించినట్లు వెల్లడించారు. వీరి నమూనా తీసుకుని పుణెకు పంపారు.
ఆసుపత్రుల్లో మందుల నిల్వలు..
కరోనా వైరస్‌కు కోసం ఏర్పాటు చేసిన అన్ని ఆసుపత్రుల్లో తగినంత మందుల నిల్వలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటీఎంఎస్ (వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా), పీపీఈఎస్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైన పరీక్షా, వస్తు సామగ్రిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం కిట్లు పంపడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు..
నేటి నుంచి కరోనా పరీక్షలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బాధిత వ్యక్తుల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. 24x7 కంట్రోల్ రూమ్ రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉంచామని... ఫిర్యాదుల కోసం 040-24651119 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపింది.