హైదరాబాద్ మహానగర పరిధిలో కరోనా వైరస్ (కొవిడ్ 19) విజృంభిస్తోంది. ఈ నెల 2వ తేదీ వరకూ నమోదైన మొత్తం కేసుల (154)ను పరిశీలిస్తే.. దాదాపు 50 శాతం కేసులు మహానగర పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ (50), రంగారెడ్డి (15), మేడ్చల్ (11) జిల్లాల్లో కలిపి 76 కేసులు గుర్తించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17) జిల్లాల్లో నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను ఇప్పటి వరకూ 20 జిల్లాల్లో కరోనా వైరస్ బాధితులున్నట్లు నిర్ధారణ అయ్యింది. తొలుత అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఈ వైరస్ ఛాయలు కనిపించగా, ఆ తర్వాత దిల్లీ మర్కజ్‌కు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వెళ్లొచ్చిన ప్రయాణికుల్లో పెద్దఎత్తున వైరస్ వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో వెల్లడైంది.
154 కేసుల్లో 75 (48.70 శాతం) మంది బాధితులు మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారే. వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా 33 మంది వైరస్ బారిన పడ్డారు. ఇలా మొత్తం 108 మంది మర్కజ్ ప్రయాణికులు, వారితో కలివిడిగా ఉన్నవారే కావడం గమనార్హం.
చిన్న ఇల్లు... పెద్ద కుటుంబం
మర్కజ్‌కు వెళ్లొచ్చిన కుటుంబాల్లో వైరస్ వ్యాప్తిపై వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ నిర్ధరించిన కేసుల్లో పాతబస్తీ, కుత్బుల్లాపూర్, నాంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ఆరు కుటుంబాల్లో నలుగురు, అంతకు మించి వ్యక్తుల్లోనూ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో అత్యధికులు చిరు వ్యాపారులు, దిగువ మధ్యతరగతి వారేనని గుర్తించారు. రెండు గదులుండే చిన్న ఇంట్లో ఆరేడుగురికి పైగా జీవిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. గాలి, వెలుతురు సరిగా లేని ఇళ్లలో దగ్గర దగ్గరగా గడపడం వల్ల.. ఒకరి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని వైద్యాధికారుల అంచనా. ఇళ్లన్నీ పక్కపక్కనే ఆనుకొని ఉండడం వల్ల ఇరుగుపొరుగు వారితోనూ కలిసే అవకాశమున్నట్లు గుర్తించారు.
- ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన ఒక వస్త్ర వ్యాపారి (61)కి దిల్లీ వెళ్లొచ్చాక కరోనా సోకినట్లు నిర్ధరించారు. ఈయన తన కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు సహా రెండేళ్ల బాలుడితోనూ వారం రోజుల పాటు గడిపారు. ఆయన మార్చి 18న దిల్లీ నుంచి తిరిగి రాగా, 25న లక్షణాలు కనిపించడంతో తొలుత ఒక ప్రైవేటు ఆసుపత్రిలో, తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన చికిత్స పొందుతూ 30వ తేదీన మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో అందరినీ పరిశీలనలో ఉంచాల్సి వచ్చింది.
- ఇలాగే మరొకరు కూడా కరోనాతో మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 21 మందిని వైద్యపరిశీలనలో ఉంచారు.
- డబీర్‌పురాకు చెందిన మరొకరికి కూడా దిల్లీ నుంచి వచ్చాక కరోనా పాజిటివ్ తేలింది. ఈయనతో నేరుగా గడిపిన వ్యక్తులు 12 మంది కాగా, వారితో సన్నిహితంగా గడిపిన మరో 20 మంది ఉన్నారు. వీరిలో ఆరేళ్ల లోపు చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారు. ఇప్పుడు వైద్య సిబ్బంది వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- మాదన్నపేటకు చెందిన ప్రైవేటు లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారికి కరోనా సోకినట్లు గురువారం నిర్ధారణ అయ్యింది. ఈయన వ్యాపార పనుల నిమిత్తం మార్చి 18 నుంచి 29వ తేదీ వరకూ పదుల సంఖ్యలో వ్యక్తులను కలిశాడు. వీరందరి సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు వైద్యసిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగుల్లో అయిదుగురిని గుర్తించి ఆసుపత్రుల్లో పరీక్షలకు తరలించారు.
- బహదూర్‌పురాకు చెందిన వ్యక్తి (60) దిల్లీ వెళ్లి మార్చి 19న హైదరాబాద్‌కు వచ్చాక.. 30వ తేదీన లక్షణాలు బయటపడడంతో ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఈయనలో కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ వ్యక్తితో ఒకేచోట గడిపిన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఆరోగ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇందులో ఏడు నెలల చిన్నారి.. బాధితుని మనవరాలు, రెండున్నర ఏళ్ల బాలుడు (మనవడు) కూడా ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫీవరాసుపత్రికి తొమ్మిది మంది అనుమానితులు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మంది కరోనా అనుమానితులు నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో చేరారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన వీరందరిలోనూ కరోనా లక్షణాలుండటంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎల్బీనగర్ నుంచి ఒకరు, చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి ఆరుగురు, మలక్‌పేట చెందినవారు ఇద్దరు ఉన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు