రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో... కొవిడ్ రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు మూడు లక్షల మందికిపైగా సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం.. కోవిన్ సాఫ్ట్ వేర్లో నమోదు చేసుకోగా... కేవలం 58.3శాతం మంది మాత్రమే తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోసు తీసుకున్న కేంద్రంలోనే రెండో డోసూ వేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అపోహలు వీడి టీకా వేసుకోవాలని.. వైద్యాధికారులు సూచిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, టిమ్స్ డైరెక్టర్ విమలాథామస్ తదితరులు రెండో డోసు టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారిలో విపరీత ప్రతిస్పందనలు ఎవరికీ రాలేదని డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. దాదాపుగా ఎవరికీ రెండో డోసు ఆపాల్సిన అవసరం లేదన్నారు. మహిళలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని టిమ్స్ డైరెక్టర్ విమలాథామస్ భరోసా కల్పించారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని సూచించారు.
మొదట ఏ టీకా తీసుకుంటే.. ఇప్పుడు అదే..
మొదట ఏ టీకా వేసుకున్నారో.. రెండో డోసు అదే కంపెనీది వేసుకోవాలని అధికారులు వెల్లడించారు. తొలిరోజు మొత్తం 3వేల975మందికి రెండో డోస్ అందించారు. తొలిడోసు తీసుకున్న వారిలో తీవ్ర దుష్పరిణామాలు ఎదురైన వారికి.. రెండో డోస్ టీకా ఇచ్చే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికీ మొదటి డోస్ తీసుకోని సిబ్బంది ఈనెల 25లోగా తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఇతర శాఖల సిబ్బంది మార్చి 5లోగా మొదటి డోస్ తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ షురూ