దేశంలో కొన్ని రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా.. కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
నాలుగు దశలు..
టీకా వేయడం మినహా నాలుగు దశల్లో జరిగే ప్రక్రియను ఇందులో పరిశీలిస్తారు. తొలుత వెయిటింగ్, రెండో దశలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మూడో దశలో వ్యాక్సినేషన్, నాలుగో దశలో పర్యవేక్షణను పరిశీలిస్తారు. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినవారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీసి.. దీర్ఘకాలిక వ్యాధులు సహా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనే వివరాలు సేకరిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో, టీకా ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
ఇది వరకే 2 జిల్లాల్లో..
ప్రతి రాష్ట్రంలో కనీసం 3 చోట్ల డ్రైరన్ చేపట్టాలన్న కేంద్రం సూచన మేరకు ఈనెల 2న హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ ప్రక్రియను నిర్వహించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం