తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్-19 పరీక్షలు, చికిత్సకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులు, లాబొరేటరీల్లో కొవిడ్ పరీక్షలు, చికిత్సలకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన గంటా జైకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ అంశంపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
అనుమతిస్తే పరిస్థితి మరింత జటిలం
రాష్ట్రంలో 12 ప్రైవేట్ ల్యాబ్‌లకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్తోమత ఉన్న వారిని ప్రైవేటు, కార్పొరేట్‌కు అనుమతిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతిస్తే పరిస్థితి మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని, గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు, చికిత్స ఉచితంగా చేస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ వివరించారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మలిచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వాస్పత్రులకే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు అడిగింది. తమకు నచ్చిన చోట చికిత్స చేయించుకోవడం ప్రాథమిక హక్కు అని, దానిని ఎలా కాదంటారని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, వసతుల కొరత ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి