ఇప్పటివరకు ఒక్కరోజులో నిర్వహించిన పరీక్షల్లో, వెల్లడైన ఫలితాల్లో ఇవే అత్యధికం. గతంలో నమోదైన కేసులతో పోల్చితే సంఖ్య పెరిగినప్పటికీ మొత్తం పరీక్షించిన నమూనాలను పరిగణనలోకి తీసుకుంటే సోమవారం పాజిటివ్‌ల శాతం 4.87 మాత్రమే. గత వారం రోజుల సరళిని గమనిస్తే పాజిటివ్ నమోదు శాతం క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది ఈ నెల 16న 10.16 శాతం నమోదుకాగా, 20న 7.34 శాతం, 24న ఐదు శాతం లోపే నమోదైంది.
కోలుకున్నవారు వారు 77.44 శాతం
రాష్ట్రంలో సోమవారం మరో 1752 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు కరోనా బారి నుంచి ఆరోగ్యవంతులుగా బయటపడినవారి సంఖ్య 84,163కు పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 77.44 శాతం. ఈ విషయంలో జాతీయ సగటు 75.27 శాతంగా ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో మరో 9 మంది మృత్యువాతపడగా, మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 770కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 23,737 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో, ఇళ్ల వద్ద వైద్యసేవలు పొందుతున్నవారు 17,226 మంది ఉన్నారు. ప్రభుత్వ వైద్యంలో 7952 పడకలను కొవిడ్ సేవల కోసం కేటాయించగా, వీటిలో సోమవారం నాటికి 2380 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 5572 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో కరోనా చికిత్సల కోసం మొత్తం 9065 పడకలను కేటాయించగా, వీటిలో 4131 పడకల్లో వైద్యసేవలు పొందుతుండగా, మరో 4934 పడకలు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి గత నెలవరకు జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్) పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈనెలలో క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు రోజుకు 1500-1700 వరకు కూడా పాజిటివ్‌లు రాగా 400-500కు తగ్గింది. సోమవారం 295 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత వారం రోజుల సరళిని పరిశీలించినా.. ఈనెల 18న 484 కరోనా కేసులు నమోదవగా, 21న 472 పాజిటివ్‌లు, 23న 373 కేసులు, తాజాగా 300 లోపే నమోదయ్యాయి.
జిల్లాల్లో పెరుగుదల
జిల్లాల్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజా ఫలితాల్లో రంగారెడ్డి(186), ఖమ్మం(161), వరంగల్ నగర(143), నిజామాబాద్(142), నల్గొండ(129), కరీంనగర్(116), మేడ్చల్ మల్కాజిగిరి(106), మంచిర్యాల(104) జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి. 20కి పైగా పాజిటివ్‌లు నిర్ధారించిన జిల్లాల జాబితాలో జగిత్యాల(98), సిద్దిపేట(92), పెద్దపల్లి(85), భద్రాద్రి కొత్తగూడెం(83), మహబూబాబాద్(81), సూర్యాపేట(78), మహబూబ్‌నగర్(69), కామారెడ్డి(64), రాజన్న సిరిసిల్ల(59), వనపర్తి(56), నాగర్‌కర్నూల్(48), జోగులాంబ గద్వాల(47), యాదాద్రి భువనగిరి(46) జనగామ(46), మెదక్(42), ఆదిలాబాద్(34), వరంగల్ గ్రామీణ(31), సంగారెడ్డి(30), నిర్మల్(28), వికారాబాద్(23) ఉన్నాయి.i
హతవిధీ!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో 60 ఏళ్ల ఓ వృద్ధురాలు మరణించారు. పాజిటివ్ వచ్చిన కుమారుడితో ఉన్నందున ఆమె మృతికీ కరోనాయే కారణం కావొచ్చని అనుమానించి ఏ ఒక్కరూ ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లలేదు. విధిలేని పరిస్థితుల్లో కుమారుడొక్కడే ఆమె భౌతికకాయాన్ని మోసుకెళ్లి.. జేసీబీ తొట్టిలో పెట్టి శ్మశాన వాటికకు తరలించారు.
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!