తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. కరోనా బాధితులకు బెడ్లు, రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ లాంటి ప్రాణ రక్షక మందులు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణవాయువు లేక ఎంతో మంది ఊపిరొదులుతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
అనుభవం ఉన్న నిపుణలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించి ప్రైవేట్, ప్రభుత్వ బెడ్లను ఒకే వేదిక పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కరోనా కట్టడికి ముంబయి అనుసరించిన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.