భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారితోపాటు మాంసం దుకాణాల నిర్వహకులు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. వీరి ద్వారా మరింత మందికి కొవిడ్-19 వ్యాప్తి చెందుతోంది.
గతంలో కుటుంబంలో ఒక్కరికి ఇద్దరికి పరిమితమైన కేసులు... ఇప్పుడు కుటుంబ సభ్యులకు అందరికీ సోకుతోంది. నగరంలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ తరహాలో వ్యాపించినవే. ప్రభుత్వం, స్థానిక సంస్థలు చెబుతోన్న జాగ్రత్త చర్యలు ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. కరోనా నిబంధనలు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదు. విందులు వినోదాల పేరుతో బంధువులంతా ఒకే దగ్గర కలవడం... చిన్నస్థాయి ఉత్సవాలు నిర్వహించుకోవడం కేసుల సంఖ్య భారీగా పెరగటానికి కారణమైంది.
ఖైరతాబాద్‌లో కూరగాయలు విక్రయించే మహిళకు కరోనా నిర్ధరణ అయింది. వాళ్లింటికి వచ్చిన బంధువులకు పరీక్షలు నిర్వహించగా... 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక తెలిపారు. ఈ ఏరియాలో పక్కపక్కనే ఇళ్లు ఉండడం వల్ల దాదాపు 20 ఇళ్ల వరకు కంటైన్మెంట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
15 నెలల పాపకు కరోనా పాజిటివ్...
శుక్రవారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన 17 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో అధికంగా అంబర్‌పేట నుంచి 5, సికింద్రాబాద్- 4, గోల్కొండ-1, పురానాపూల్- 1, అమీర్‌పేట్- 3, గోషామహల్ -1, చంద్రాయన గుట్ట నుంచి ఇద్దరికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మంది మీడియా ప్రతినిధులకు కూడా పరీక్షలు చేసినట్లు చెప్పారు. నిన్న 15 మందికి నిర్వహించిన టెస్టుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. మల్లన్న టెంపుల్ బాగ్ అంబర్పేట్ ప్రాంతానికి చెందిన 15 నెలల పాపకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు ప్రకటించారు.
మరో ఆరుగురికి...
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని పహాడి షరీఫ్ గ్రామంలో ఓ మాంసం వ్యాపారితో కలిసి విందు చేసుకున్న వారిలో మరో ఆరుగురికి కరోనా నిర్ధరణ అయినట్లు జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఆ విందులో పాల్గొన్న 30 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మాంసం దుకాణదారుని వద్ద కొనుగోలు చేసిన మొత్తం 70 మందిని హోమ్ క్వారంటైన్ చేసి.. 80 ఇళ్లను అధికారులు కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించారు.