తెలంగాణలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. వైద్యఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలను బట్టి.. రాష్ట్రంలో గత మూడునెలల్లోనూ కొవిడ్ ఉద్ధృతి 23 శాతం నుంచి 4 శాతానికి తగ్గినట్లుగా స్పష్టమవుతోంది. జూన్‌లో 58,231 పరీక్షలు నిర్వహించగా 23 శాతం పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. జులైలో 3,69,288 పరీక్షలు చేయగా.. 13 శాతం పాజిటివ్‌లు తేలాయి. ఆగస్టులో ఏకంగా 9,65,253 పరీక్షలు నిర్వహించగా.. 7 శాతం కొవిడ్ కేసులే నిర్ధారణ అయ్యాయి. అదే సెప్టెంబరులో 29 రోజుల్లోనే 15,16,796 నమూనాలను పరీక్షించగా.. 4 శాతం మాత్రమే కరోనా కేసులు తేలాయి. సగటున రోజుకు ప్రస్తుతం 50-55 వేల నమూనాలను పరీక్షిస్తున్నా.. కొత్త కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే అంశమే. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారి శాతం కూడా తెలంగాణలో 84 శాతం ఉంది. ఇక్కడి కంటే 23 రాష్ట్రాల్లో కోలుకుంటున్నవారి శాతం తక్కువగానే ఉండడం గమనార్హం.
వ్యాప్తి రేటూ తక్కువే
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రేటు కూడా తక్కువగానే ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో తొలినాళ్లతో పోల్చితే ప్రస్తుత కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జూన్‌లో రోజుకు 1500 కేసులు వరకు రాగా, ఇప్పుడు రోజుకు 200-350 మాత్రమే వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో జులైలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ వ్యాప్తి రేటు 1.9 ఉండగా.. ప్రస్తుతం అది 0.5 శాతానికి తగ్గింది. అంటే వైరస్ సోకిన వ్యక్తి తనను కలిసిన 10 మందిలో ఐదుగురికే వ్యాప్తి చేస్తున్నట్లుగా వైద్యవర్గాలు వివరించాయి. జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి రేటు 0.8గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,477 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతుండగా.. వారిలో ఎక్కువమంది (4,026) జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నారు. మరో 10 జిల్లాల్లో కరోనా తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 1,000కి పైగా బాధితులున్న జిల్లాల్లో మేడ్చల్ (2,276), రంగారెడ్డి (2,291), నల్గొండ (1,978), కరీంనగర్ (1,551), ఖమ్మం (1,309), భద్రాద్రి కొత్తగూడెం (1,209), వరంగల్ నగర (1,209) సిద్దిపేట (1,110), నిజామాబాద్ (1,024), సూర్యాపేట (1,024) జిల్లాలున్నాయి. నారాయణపేట (228), వికారాబాద్ (242), ఆదిలాబాద్ (270) జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి అతి తక్కువగానే నమోదైంది.
త్వరలో సాధారణ సేవలు
గాంధీ ఆసుపత్రిలో త్వరలోనే సాధారణ వైద్యసేవలను పునరుద్ధరించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవిడేతర సేవలను ప్రారంభించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్ కట్టడి చర్యలను కచ్చితంగా పాటించాలనీ, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. గుంపుగా తిరగొద్దనీ, మాస్కులు, చేతులు శుభ్రపర్చుకోవడం మానవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రజలు సహకరిస్తే ఇంకా తగ్గుతాయి. జీహెచ్‌ఎంసీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఐటీ సంస్థలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం 33 జిల్లాల్లో 15.42 శాతం కొవిడ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 79,206 పరీక్షలు చేస్తున్నాం’’ అని చెప్పారు.
అంచనా వేసినట్లే తగ్గింది: వైద్యవిద్య సంచాలకులు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడేతర సేవలు యథావిధిగా కొనసాగుతాయని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. ముందు అంచనా వేసినట్లుగానే సెప్టెంబరు నెలాఖరుకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందనీ 1,225 వెంటిలేటర్ పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: స్వచ్ఛ భారత్’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ