గతేడాది మాదిరి ఈ ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర ఖజానాపై రెండో విడత కరోనా ప్రభావం పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్ర రాబడులపై కరోనా పంజా విసురుతోంది. గడిచిన పదిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండడం, ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండడం వల్ల ఆ ప్రభావం వివిధ రంగాలపై పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నుల శాఖ రాబడులపై ప్రభావం మొదలైంది. దీనితో వ్యాట్, జీఎస్టీ రాబడులు తగ్గినట్లు పేర్కొంటున్న అధికారులు... మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పడిపోయిన విక్రయాలు
రాష్ట్ర రాబడులపై భారీ అంచనాలతో ఉన్న ఆర్థిక, వాణిజ్య వర్గాలు మొదటి నెల రాబడుల ప్రభావంపై సమీక్ష చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు గత ఆర్థిక ఏడాది రూ.52,436.21 కోట్లు కాగా... ఈ ఏడాది రాబడిని ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. తాజాగా కరోనా తీవ్ర స్థాయిలో ఉండడంతో అమ్మకాలు, రవాణా, నిర్మాణ రంగంతో సహా పలు రంగాలపై ఆ ప్రభావం పడింది. గత పది రోజులుగా అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పెద్ద మొత్తంలో రాబడులు వచ్చే కీలకమైన వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు పడిపోయాయి. పర్యాటక, వినోదం విభాగాలు మూతపడటంతో పన్ను రాబడి గణనీయంగా తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైద్యం, ఆహారపదార్థాల కొనుగోలు తప్ప ఇతరత్రా ప్రజలు కొనుగోలు చేయడంలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.
ఇది ఇలానే కొనసాగితే..
గత ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా ప్రభావంతో రూ.932.54 కోట్లు మాత్రమే వచ్చింది. మే నెలలో రూ.1,567.22 కోట్లు రాగా... ఆ నెలలోనే లాక్డౌన్ ఎత్తివేయడంతో రాబడులు క్రమంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి పది రోజులు మినహా ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అన్ని రంగాలపై ఈ ప్రభావం పడటమే కాకుండా క్రమంగా పెరుగుతోందని... ఇది ఇలానే కొనసాగితే వచ్చే నెలలో ఈ ప్రభావం మరింత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్ కారణంగా ఏప్రిల్, మే మొదటి రెండు నెలలు రాబడులపై తీవ్ర ప్రభావం పడగా ఆ తర్వాత క్రమంగా పరిస్థితి మెరుగైంది. అక్టోబర్ నుంచి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆరు నెలలపాటు రాబడులు భారీగా ఉండటంతో 10 శాతం వృద్ధి రేటు నమోదైంది.
రిజిస్ట్రేషన్లపై కనిపించని ప్రభావం
ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై మాత్రం కరోనా ప్రభావం అంతగా పడలేదు. ఏప్రిల్ ప్రారంభం నుంచి కూడా క్రయ విక్రయాలు జోరుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.392.42 కోట్ల రాబడి వచ్చింది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 71,948 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు సాధారణంగా ఉన్నాయని, స్లాట్ బుకింగ్లు కూడా బాగున్నాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'మాస్క్ ధరించని వారిపై వారంలోనే 16 వేల కేసులు'