కరోనా వ్యాప్తి భయంతో పాటు చేపలు రవాణా చేసేందుకు వాహనాలు, పోలీసు అనుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఎక్కడి చేపల్ని అక్కడే విక్రయిస్తున్నారు. పటాన్‌చెరు, అమీన్‌పూర్ వంటి రాజధాని శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో పట్టిన చేపల్ని ఇప్పుడు స్థానికంగానే విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో 60-70 టన్నులు, వారాంతంలో 100 టన్నులకు పైగా చేపలు వస్తుంటాయి. కానీ 12వ తేదీ ఆదివారం నాడు మాత్రం 25-30 టన్నులకు మించి రాలేదు.
నగరంలోని రాంనగర్ చేపల మార్కెట్ రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇప్పటి వరకూ ఇది మూసి ఉండగా.. మూడురోజుల నుంచి రోజూ ఉదయం 2 గంటల పాటే ఇక్కడ అమ్మకాలకు అనుమతిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే విక్రయాల్లో 70 శాతం ఇక్కడే జరుగుతుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ చెరువులో పెంచే చేపలు విక్రయానికి స్థానికంగా దొరికేవి కాదు. ఎక్కువ ధర వస్తుందని కాజీపేట మార్కెట్‌లో విక్రయించేవారు. కరోనా తర్వాత ఇక్కడి చేపల్ని స్థానికంగానే విక్రయిస్తున్నారు.
పెరుగుతున్న ధరలు
- చేపల రవాణా తగ్గిన నేపథ్యంలో వాటి ధరలు పెరుగుతున్నాయి. రవ్వ, బొచ్చె తదితర రకాల ధర కిలోకు రూ.150-160 వరకు ఉంది. ఇతర జిల్లాలు, గ్రామాల్లో కిలో రూ.120నుంచి రూ.160 మధ్య పలుకుతోంది.
- జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామం అద్‌లోనికుంట చెరువులో ఆదివారం ఒక్కరోజే 220 కిలోల చేపలను పట్టారు. స్థానిక మార్కెట్‌లో కిలో రూ.130 వరకు విక్రయించారు.
- నారాయణఖేడ్ ముడ్రియల్ చెరువులో ప్రతి ఆదివారం 70-100 కిలోల చేపలు పడుతున్నారు. చెరువు వద్దే కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు.
- వరంగల్ అర్బన్ జిల్లా పంథిని నాగుల చెరువులో సుమారు 100 కిలోల వరకు చేపలు వేటాడారు. ఇక్కడ కిలో రూ.150 వరకు ధర పలికింది.
15 వేల మందికి జీవనాధారం
చేపల విక్రయాలపై జీహెచ్‌ఎంసీ పరిధిలో 15వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. చేపలు కొంతమేర వచ్చినా జనాలు కొంటారో.. లేదోనన్న సందేహంతో... రాంనగర్ మార్కెట్‌కు 10 లారీలు కూడా రాలేదు. ఇళ్ల మధ్యలో ఈ మార్కెట్ ఉండటం.. కొందరు అభ్యంతరం చెబుతుండటంతో అమ్మలేకపోతున్నామంటూ మత్స్యకారులు వాపోతున్నారు. చికెన్ తినాలని చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రచారం చేయాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు