సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల. ఈ కల సాకారంలో ఇటుక మోసే కూలీ నుంచి నిర్మాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది భాగస్వామ్యమవుతారు. ప్రస్తుతం నిర్మాణ రంగం కరోనా కారణంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఎప్పుడూ నిర్మాణ పనులతో కనిపించే భాగ్యనగరిలో ఇప్పడు సగం వదిలేసిన కట్టడాలు దర్శనమిస్తున్నాయి. కూలీల కొరత, సరిహద్దుల వద్ద ఆంక్షలతో సరకు రవాణా భారంగా మారడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో గృహ నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక, సిమెంట్, ఐరన్‌కు డిమాండ్ పడిపోయింది. గతేడాది ఈ సీజన్లో బిజీగా జరిగిన వ్యాపారం కొవిడ్ కారణంగా పడిపోయింది. ప్రస్తుతం మైనర్ రిపేరింగ్ కొరకే తమ వద్దకు కొనుగోళ్లకు వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
పని లేక ఇబ్బందులు
స్థల చదును, మట్టి తవ్వకం చేసే జేసీబీలకు ఆర్డర్లు రావటం లేదని.. వాటిపై ఆధారపడిన డ్రైవర్లు వాపోయారు. రోజుకు 6 నుంచి 8 గంటలు పని దొరికే తమకు.. ఇప్పుడు గంట పని దొరకటం గగనమయిపోయిందని బాధపడుతున్నారు. ఇప్పుడు చాలా వరకు ఇళ్లు నిర్మాణ దశలో ఆగిపోయాయాని.. ఇళ్లు పూర్తయితేనే తమకు గిరాకీ అని ఓ టైల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. డబ్బులుండి నిర్మాణం పూర్తి చేసుకుందామనుకునే వారిని కూలీల కొరత వేధిస్తోంది. ఏపీ, ఒడిషా, బిహార్, యూపీ నుంచి వచ్చిన కూలీలు ఈ రంగంపై ఆధారపడి నగరంలో జీవనోపాధి పొందేవారు. ఇప్పుడు కరోనా కారణంగా వీరిలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని ఓ ఇంటి యజమాని వాపోయారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?