రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 650కి చేరింది. బాధితుల్లో ఎనిమిది మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి ఇంటికెళ్లారు. ఇలా ఇప్పటి వరకూ మొత్తం 118 మంది ఆరోగ్యవంతులయ్యారు. గురువారం మరో 128 మంది డిశ్చార్జి కానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 514 మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. 22 జిల్లాల్లో 259 కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం 94,514 గృహాల్లో 1,13,192 మందిని వైద్యసిబ్బంది పరిశీలించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. కంటెయిన్‌మెంట్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో 14 రోజుల వరకూ ఒక్క పాజిటివ్ కేసు రాకపోతే అప్పుడు ఆయా ప్రాంతాలను నిర్బంధ పరిశీలన నుంచి విముక్తి చేస్తారు.
వికారాబాద్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి..
వికారాబాద్‌లో బుధవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి దశరథ్ తెలిపారు. ఈ రోజు సోకిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఓ కాలనీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15కి చేరిందన్నారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 33కి చేరిందని వీరందరికి గాంధీలో చికిత్సలు అందిస్తున్నామన్నారు.
29 రోజుల తర్వాత పాజిటివ్
కరీంనగర్ నుంచి దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి 29 రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షలో కరోనా ఉన్నట్లు తేలింది. బుధవారం రాత్రి అతణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గతంలో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఆ వ్యక్తి ఎవరెవరిని కలిసి ఉంటాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్లాస్మాథెరపీ అమలుకు విలువల కమిటీ
కరోనా బారినపడి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి.. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు అందించే ప్లాస్మాథెరపీని రాష్ట్రంలో అమలు చేయడంపై నైతిక విలువల కమిటీని ప్రభుత్వం నియమించింది. గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ ఆచార్యులు డాక్టర్ రాజారావు ఈ కమిటీకి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. వైద్యులు వినయ్‌శేఖర్, కృష్ణమూర్తి, నాగమణి, త్రిలోక్‌చంద్, సుధ, హేమంత్ తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొంటూ వైద్యవిద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్