రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వైరస్ నిర్ధరణ అయిన వారి సంఖ్య 100కు చేరువలో ఉంది. మంగళవారం ఒక్క రోజే 15 మందికి కొత్తగా కొవిడ్-19 సోకినట్లు గుర్తించారు. మొత్తంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 97కు పెరిగింది. వీరిలో 14 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం వేర్వేరు ఆస్పత్రుల్లో 77 మంది చికిత్స పొందుతున్నారు.
దిల్లీ వెళ్లిన వారిలో 35 మందికి పాజిటివ్:
దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 1,030 మంది వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇప్పటివరకూ 35 మందిలో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మిగిలిన వారిలో ఎందరిలో కరోనా లక్షణాలున్నాయి..? వారు ఎంతమందిని కలిశారనేది ప్రాధాన్యాంశాలుగా మారాయి. కరోనా సోకిన వారిలో నాగర్‌కర్నూలులో ఓ బట్టల వ్యాపారి, ఓ మటన్ వ్యాపారి ఉన్నారు. వీరు వందల మందిని కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువగా అంచనా వేసుకున్నా.. వెయ్యి మంది ఒక్కొక్కరూ 10 మందినైనా కలిసి ఉంటారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలిపి 10 వేల మందికి పైగా వీరితో కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
వైద్యులు, నర్సులు 20 మంది విడి గదుల్లో..
రాష్ట్రంలో ఏ ప్రాంతలోనైనా ఉన్నట్టుండి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయా.. అనే కోణంలోనూ వైద్య ఆరోగ్యశాఖ దృష్టిసారించింది. ఇప్పటివరకూ తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న కేసులు 400 వరకూ నమోదుకాగా.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి 120 కేసులొచ్చినట్లు గుర్తించారు. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ.. ఆయా రోగుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.
నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు కరోనా నిర్ధరణ కావడం వల్ల ఆ పాపకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు 20 మందిని విడి గదుల్లో పరిశీలనలో ఉంచారు. ఈ పరిస్థితిలో తమకు ఎన్-95 మాస్కులు, రక్షణ సామగ్రి అందించాలని నిలోఫర్ వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి ఈటల హామీతో వారికి అవసరమైన మాస్కులు, కిట్లు అందజేశారు.
పోలీసులు రోగులను అడ్డుకోవద్దని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డయాలసిస్, తలసీమియా, సికెల్‌సెల్ అనీమియా వంటి జబ్బులున్న వారికి రక్తమార్పిడి అవసరమవుతుందని.. వారు ఆస్పత్రులకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు.
ఇదీ చూడండి: దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి