కరోనా వృద్ధులనే కాదు పిల్లలు, యువతను వణికిస్తోంది. రాష్ట్రంలో 11 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు, యువకులపై కరోనా పంజా విసురుతోంది. జులై నెలాఖరు వరకూ చిన్నారుల్లో కేసులు తక్కువగానే ఉన్నాయి. అప్పట్లో 21-50 ఏళ్లలోపు వారిలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ కేటగిరీలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లోనూ కేసులు తగ్గాయి. జులై నెలాఖరు నాటికి మొత్తం కరోనా బాధితుల్లో పదేళ్లలోపు చిన్నారులు 3.4 శాతం ఉంటే.. ప్రస్తుతం 4.23 శాతానికి పెరిగారు.
బాధితుల్లో 11-20 ఏళ్ల మధ్య వయస్కులు జులై నెలాఖరు నాటికి 5.3 శాతం ఉంటే ఆగస్టు 22 నాటికి 6.5 శాతం, ప్రస్తుతం 8.72 శాతానికి పెరిగారు. అంటే ఈ విభాగంలో పెరుగుదల దాదాపు 30 శాతంపైగా నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 12.95 శాతం ఉన్నారు.
కారణాలివీ..
- గత రెండు నెలలుగా వ్యాపార కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. బయట తిరగడం పెరిగింది. పిల్లలు ఆన్లైన్ తరగతులతో ఇంటికే పరిమితమైనప్పటికీ కుటుంబసభ్యుల ద్వారా పిల్లలకు సోకుతోంది. 11-20 ఏళ్ల మధ్య పిల్లల్లోనూ 13 ఏళ్లుపైబడిన వారిలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ సమయంలో వైరస్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా కేసుల వివరాలివీ..
రాష్ట్రంలో శుక్రవారం మరో 2,278 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 1,54,880కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ మరో 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 950కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 32,005 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డి జిల్లాలో 184, మేడ్చల్‌లో 150, నల్గొండలో 126, కరీంనగర్ జిల్లాలో 121 కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు, షాపింగ్‌కు తీసుకెళ్తున్నారు. వీలైనంత వరకు పిల్లల్ని బయటకు తీసుకెళ్లకపోవడం మంచిది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గర్లోని పిల్లల వైద్య నిపుణులను సంప్రదించి, చికిత్స పొందాలి.
- డాక్టర్ నరహరి, పిల్లల వైద్యనిపుణులు, నీలోఫర్ ఆస్పత్రి
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా కేసులు, 10 మరణాలు