Corona restrictions: కరోనా కేసుల వృద్ధి నేపథ్యంలో తెలంగాణలో వాటి నియంత్రణకు విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25 నుంచి ఈ నెల పది వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా వాటిని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన వాటితో పాటు, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది.
మాస్క్ లేకపోతే జరిమానా..
ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలంది. వ్యక్తిగత దూరం పాటించాలని, ఆవరణలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ప్రవేశద్వారాల వద్ద చేతుల పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగు ద్వారా శరీర ఉష్ణోగ్రతల తనిఖీ తదితర జాగ్రత్తలు తీసుకున్నాకే లోనికి అనుమతించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తప్పక జరిమానా విధించాలని పేర్కొంది.
Telangana corona: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,583 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,042కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 330 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1165 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 44, హనుమకొండ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 97.46 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: