రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని చెప్పారు. రెండో దశలో రాష్ట్రంలో 2.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గనిర్దేశంగా మారిందన్నారు. గ్రామాల్లో కొవిడ్ నియంత్రణలో ఉందని.. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తిస్తున్నామని తెలిపారు. కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నామని చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. కరోనా నుంచి 1.92 లక్షల మంది బాధితులు కోలుకున్నారని.. మరణాల రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రజారోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని శ్రీనివాస రావు తెలిపారు.
ఇదీ చదవండి: పల్లెప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం