రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం ఒక్కరోజే 117 కేసులు నమోదయ్యాయి. తాజాగా నిర్ధారణ అయిన వాటిలో జీహెచ్‌ఎంసీకి చెందిన వారు 58 మంది ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 5, మేడ్చల్‌లో 3, సిద్దిపేటలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.
వీరితో కలిపి మొత్తంగా 1908 మంది రాష్ట్రవాసులకు వైరస్ సోకింది. తాజాగా మహమ్మారి కోరల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 67కు పెరిగింది. సౌదీ అరేబియా నుంచి వస్తున్న వారిలోనే వైరస్ ముప్పు ఎక్కువగా ఉండడం వల్ల వైద్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.
2 రోజులుగా పాజిటివ్ కేసులు వంద దాటడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బుధవారం అత్యధికంగా 107 , గురువారం 117 కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం 2256 మంది బాధితులయ్యారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు 175 మంది కరోనా బారినపడ్డారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 143 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన 30 మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారందరికీ భారత్‌కి రాకముందే కరోనా సోకిందని.. వారందరినీ ప్రస్తుతం సైనిక, వైమానిక క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు సంబంధించిన వారిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ఆశా కార్యకర్తలు నిరంతరం ఆరా తీస్తున్నారు.