కరోనా మహమ్మారి ధాటికి హైదరాబాద్ మహానగరం వణుకుతోంది. ముఖ్యంగా వారాంతంలో వైరస్ విరుచుకుపడుతోంది. నిబంధనలు గాలికొదిలేస్తున్న ఫలితం కొవిడ్ పాజిటివ్ కేసుల రూపంలో బయటపడుతున్నాయి. వారాంతపు వేళల్లో విందులు, వినోదాల ప్రభావం వారం రోజుల వ్యవధిలో కరోనా లక్షణాలతో వెలుగు చూస్తున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వెంటాడే అనుమానంతో వారానికి 3-4సార్లు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
![](https://assets.eenadu.net/article_img/250421aptest-1a.jpg)
ఉద్విగ్న వాతావరణం
ఎటుచూసినా ఉద్విగ్న వాతావరణం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్న వాహనాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల బంధువుల ఎదురుచూపులు. మహానగరంలో కొవిడ్ వైద్యం అందిస్తున్న ప్రతి ఆస్పత్రి వద్ద కనిపిస్తున్న దృశ్యాలు. ప్లాస్మా కావాలి, ఇంజక్షన్లు ఉన్నాయా, ఆస్పత్రిలో బెడ్లు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు. కొవిడ్ సోకి స్వీయ నిర్బంధంలో ఉన్నవారు ఆక్సిజన్ స్థాయిలు ఏ మాత్రం తగినట్టుగా అనిపించినా బెంబేలెత్తిపోతున్నారు. ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న తమ వారిని కాపాడుకునేందుకు బంధువులు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని శ్మశానవాటికల వద్ద చితిమంటలు ఆరటంలేదంటున్నారు అక్కడి సిబ్బంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే కొవిడ్, అనుబంధ వ్యాధులతో హైదరాబాద్ నగరంలో వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. కాగా గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1259 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీలో 975 మంది చికిత్స పొందుతుండగా.. వీరిలో 600 మందికి పైగా ఐసీయూ వెంటిలేటర్‌పైన, మిగిలిన వారు ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు.
- టోలిచౌకి పరిధిలో ఈనెల 4న జరిగిన ఓ పెళ్లి విందులో పాల్గొన్న 12 కుటుంబాలకు చెందిన 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
![](https://assets.eenadu.net/article_img/Capture_2564.png)
గాంధీలో మరణిస్తేనే.. పోలీసులకు సమాచారం
మీ ఠాణా పరిధిలో ఎన్ని కరోనా కేసులున్నాయి..? ఎంత మంది మరణించారు..? అని అడిగితే పోలీసులు ఠక్కున సమాధానం చెప్పేవారు. ఇది అప్పట్లో(మొదటి వేవ్‌లో).. మరి ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసుల దగ్గర కనీస సమాచారం ఉండటం లేదు. ఏ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలో తెలియక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ఉన్నతాధికారులు తలలుపట్టుకుంటున్నారు.
- సాధారణంగా ఏయే ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఎక్కడెక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే సమాచారం కరోనా మొదటి వేవ్‌లో సంబంధిత అధికారులు పోలీసులకు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండో వేవ్‌లో కరోనాతో గాంధీలో చేరి చనిపోయిన వారి వివరాలు మాత్రమే సంబంధిత ఠాణాలకు అందుతున్నాయి. ఆయా ఠాణాల పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు, ఇతర ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్న, మృత్యువాత పడిన వారికి సంబంధించిన సమాచారం అందటం లేదు. ‘అప్పట్లో వైద్యారోగ్య శాఖ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందేది. ఇప్పుడు రావడం లేదు. దీంతో అన్ని ప్రాంతాలపై నజర్ పెట్టాల్సి వస్తుంది. మాపై ఒత్తిడి పెరుగుతుంది’ అని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైపోక్సియా.. ఉక్కిరిబిక్కిరి
హోంఐసోలేషన్‌లో ఉన్న కొందరిలో వారం తరువాత కొవిడ్ తీవ్రత పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతూ కొవిడ్‌కు బారినపడిన 50 ఏళ్ల పై బడిన వారిలో అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో హైపోక్సియా అంటారు. వీరిలో చాలామందికి ఆక్సిమీటర్ ఉపయోగించటం తెలియని పరిస్థితి. రోజుకు 4 సార్లు ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ స్థాయిలు పరిశీలించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పల్స్ 60 పైన, ఆక్సిజన్ స్థాయి 95 పైనఉండాలి. నిర్దేశించిన స్థాయిలు తగ్గితే వైద్యులను సంప్రదించాలి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 6,551 కరోనా కేసులు నమోదు