Negligence of gas agencies: 5జీ వేగంతో సేవలందుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆన్‌లైన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే పదిహేను రోజుల వరకు చేరని దుస్థితి నగరంలో ఉంది. ఫుడ్‌డెలివరీ, క్యాబ్‌బుకింగ్, ఇ-కామర్స్ సేవలు బుకింగ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అందుతుంటే.. గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. నగరవాసులు నగదు రహిత ఆన్‌లైన్ సేవల వైపు మొగ్గు చూపుతుంటే, ఏజెన్సీలు మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదు.
ఉప్పల్‌కు చెందిన అరుణ్ పేటీఎం యాప్ ద్వారా ఈ నెల 20న గ్యాస్ రీఫిల్ బుక్ చేశారు. ఎనిమిది రోజులవుతున్నా సిలిండర్ డెలివరీ కాలేదు. గతంలో ఫోన్‌లో సిలిండర్ బుక్ చేసిన తరవాత రోజే అందేదని, డెలివరీబాయ్ రూ.30 అదనంగా తీసుకునేవారని తెలిపాడు. శేరిలింగంపల్లికి చెందిన మరో వ్యక్తి ఆన్‌లైన్‌లో మొత్తం డబ్బు చెల్లించిన పదిహేను రోజులకు సిలిండర్ తీసుకొచ్చారని వాపోయారు.
గ్యాస్ ఏజెన్సీకి పది పదిహేనుసార్లు ఫోన్ చేసినా పట్టించుకోరు. ఒకవేళ స్పందించినా ఆన్‌లైన్‌లో బుక్ చేశామని చెబితే.. ‘మీ కన్జ్యూమర్ నంబరు ఎంత..?’ అంటూ అడిగి రేపు పంపుతామంటూ తీరిగ్గా సమాధానం చెబుతున్న పరిస్థితి వినియోగదారులకు ఎదురవుతోంది. మరికొన్ని ఏజెన్సీలవారు సాంకేతిక సమస్యంటూ ఆన్‌లైన్ బుకింగ్ అంటేనే భయపడేలా చేస్తున్నారు.
ప్రతినెలా రూ.8కోట్ల అదనపు వసూళ్లు: గ్రేటర్‌లో ప్రతినెలా జరిగే గ్యాస్ రీఫిల్ బుకింగ్‌ల్లో 20శాతం మంది ఆన్‌లైన్ చెల్లింపులు జరుపుతున్నారన్నది ఆయిల్ కంపెనీల ప్రతినిధుల లెక్క. ఇలా ఆన్‌లైన్‌కు వినియోగదారులు అలవాటు పడితే ప్రతినెలా సరఫరా ఏజెంట్లు వసూలుచేసే సుమారు రూ.8కోట్ల అదనపు వసూళ్లు ఆగిపోతాయని ఆయా ఏజెన్సీల ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న ఆన్‌లైన్ చెల్లింపులు: గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 40లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. నిత్యం 90వేల బండలు ఇంటింటికీ చేరతాయి. డెలివరీబాయ్‌లు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే సుమారు రూ.28లక్షల పైమాటే. దీంతో ఎక్కువ మంది ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించారు. దీంతో వారు సరఫరాలో జాప్యం చేస్తున్నారు.
ఇవీ చదవండి: