కరోనా ప్రభావంతో గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా.. స్థిరాస్తి రంగం దెబ్బతింది. గృహ నిర్మాణ విభాగంలో గడిచిన 6 నెలల్లో ప్రారంభోత్సవాలు 43 శాతం, అమ్మకాలు 54 శాతానికి తగ్గిపోయాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల కంటే రెండో మూడు నెలల్లో గృహ నిర్మాణ విభాగం తీవ్రంగా నష్టపోయింది. రెండో క్వార్టర్ ప్రారంభోత్సవాల్లో 84 శాతం, అమ్మకాల్లో 90 శాతం మేర పడిపోయాయి.
దేశ రాజధాని దిల్లీ సహా మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాల్లో రెండో క్వార్టర్‌లో వంద శాతం నిర్మాణాలు జరగలేదని నైట్ ఫ్రాంక్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. పైగా ఒక్క ఇళ్లు కూడా అమ్ముడుపోలేదని పేర్కొంది. స్థిరాస్తి రంగం అనగానే కాసులు కురిపించేదిగా భావిస్తారు. ఈ రంగం విస్తరించుకుంటూ అభివృద్ధి వైపు దూసుకుపోయేదే కానీ... ఎప్పుడూ వెనకడుగువేయదని అందరి నమ్మకం, విశ్వాసం.
అలాంటిది.. నిర్మాణ రంగం కరోనా దెబ్బకి విలవిలలాడుతోంది. ముందుకు వెళ్లలేని పరిస్థితి. మార్చి మూడో వారం వరకు అనుకున్న విధంగానే అభివృద్ధి వైపు, లాభాల వైపు పరుగులు తీసిన అనంతరం... కొవిడ్‌తో ఒక్కసారిగా కుదేలైంది.
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్ అమలుతో ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర రంగాలకు రాబడులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. చిన్నపాటి వ్యాపారాలూ మూతపడ్డాయి. చిరు ఉద్యోగాలు ఊడిపోగా, వ్యాపార, వాణిజ్య సంస్థలను నమ్ముకుని బతుకుబండి లాగిస్తున్న వారు ఉపాధి కోల్పోయారు.
సొంతూళ్లకు వలస కూలీలు...
ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. డబ్బులున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నాయి. స్థిరాస్తి అభివృద్ధిలో కీలకమైన వలస కార్మికులు కరోనా దెబ్బతో సొంతూళ్లకు వెళ్లి తిరిగి రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా అన్ని రకాలుగా కరోనా ప్రభావం పడి... స్థిరాస్తి రంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది.
ప్రారంభోత్సవాలు...
గడిచిన ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా గృహనిర్మాణ విభాగం స్థితిగతులను పరిశీలిస్తే... గృహ నిర్మాణాలు, అమ్మకాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశ వ్యాప్తంగా 2019 మొదటి ఆరు నెలల్లో 1,11,175 యూనిట్లు ప్రారంభోత్సవాలు జరగ్గా ఈ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో 46 శాతం తగ్గి, 60,489 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి.
గృహ అమ్మకాలు...
అమ్మకాల్లో 2019 మొదటి అర్ధ సంవత్సరంలో 1,29,285 గృహాలు అమ్ముడుపోగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 54 శాతం పడిపోయి 59,538 యూనిట్ల అమ్మకం మాత్రమే జరిగింది. ఈ ఆరు నెలల్లో మొదటి క్వార్టర్‌కు రెండో క్వార్టర్‌కు భారీ వ్యత్యాసం ఉంది. రెండో క్వార్టర్‌లో ఏకంగా ప్రారంభోత్సవాలు 84శాతం, అమ్మకాలు 90శాతం పడిపోయాయి.
దేశ, రాష్ట్ర రాజధానుల్లో వాయిదా...
దేశ రాజధాని దిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో నిర్మాణాల ప్రారంభోత్సవాలను బిల్డర్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా.. వలస కార్మికులు అందుబాటులో లేనందున ధైర్యంగా కొత్త నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేపట్టలేక బలవంతంగా వాయిదా వేసుకుంటున్నారు.
ఆర్థిక రాజధానిలో...
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ప్రారంభోత్సవాలు తీసుకుంటే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఒక శాతం వృద్ధి కనబరచగా, రెండో క్వార్టర్‌లో ఏకంగా 95 శాతం పడిపోయింది.
బెంగళూరు, పూణెల్లో...
బెంగుళూరు నగరంలో మొదటి క్వార్టర్‌లో 13శాతం, రెండో క్వార్టర్‌లో 83 శాతం ప్రారంభోత్సవాలు తగ్గాయి. పూణె నగరంలో మొదటి క్వార్టర్‌లో 24 శాతం వృద్ధి కనబరచగా, రెండో క్వార్టర్‌లో ఏకంగా 93 శాతం పడిపోయాయి.
చెన్నై, కోల్‌కతాల్లో...
చెన్నై నగరంలో మొదటి క్వార్టర్ 24శాతం, రెండో క్వార్టర్‌లో అసలు ప్రారంభోత్సవాలు జరగలేదని సర్వే వెల్లడించింది. హైదరాబాద్ మొదటి క్వార్టర్‌లో ఏడు శాతం వృద్ధి కనబరచగా రెండో క్వార్టర్‌లో 46 శాతం పడిపోయాయి. కోల్‌కతా నగరంలో మొదటి క్వార్టర్‌లో 159శాతం వృద్ధి కనబరచగా, రెండో క్వార్టర్‌లో ఒక్కటి కూడా మొదలు కాలేదు.
నగరాల వారీగా గృహాల ధరలు గడిచిన 6 నెలల్లో దిల్లీలో 5.8శాతం, పూణెలో 5.4 శాతం, చెన్నైలో 5.5శాతం, కోల్కత్తా 3.7శాతం, ముంబయి 3.2శాతం అహ్మదాబాద్‌లో 1.9 శాతం మేర ధరలు తగ్గాయి.
హైదరాబాద్‌లో మాత్రం తగ్గలేదు...
బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రం ధరలు తగ్గలేదు. మొదటి అర్ధ సంవత్సరంలో హైదరాబాద్‌లో 6.9శాతం, బెంగళూరులో 3.3శాతం లెక్కన ధరలు పెరగి నిలకడగా కొనసాగుతుండటం విశేషం.
ఇవీ చూడండి : ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష