చారిత్రక నేపథ్యం
ఉస్మానియా ఆసుపత్రికి చారిత్రక నేపథ్యం ఉంది. సుమారు 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఒక రెండంతస్తుల భవనంలో మొదట ప్రారంభమైన ఈ ఆసుపత్రిని మరో రెండు భవనాలకు విస్తరించారు. సుమారు 1500 పడకలున్న ఈ ఆసుపత్రిలో కార్డియాలజీ, కార్డియోథెరాసిక్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ వంటి సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తున్నాయి. రోజుకు సుమారు 3వేల మంది రోగులు ఓపీలో చికిత్స కోసం వస్తుంటారు. రోజూ కనీసం 150 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. పెరుగుతున్న రోగులు, మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా ఆసుపత్రిలో వసతులు కరవయ్యాయి. దీంతో అన్ని వసతులతో నూతన భవన నిర్మాణానికి రూ.120 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
వారసత్వమే తొలి అడ్డంకి
ఉస్మానియా చారిత్రక భవనంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలు సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో, మరికొన్నింటిని పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో తాత్కాలికంగా సర్దుబాటు చేసి, పాత భవనాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. వారసత్వ జ్ఞాపకాలను భద్రపర్చుకునేలా ప్రస్తుతమున్న ఉస్మానియా భవన నమూనాను పోలినట్లు కొత్త కట్టడాలను నిర్మించాలని భావించారు. అయితే ఈ పాత భవనానికి వారసత్వ హోదా ఉండడంతో.. కూల్చివేతపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని నెలలు ఆ ప్రక్రియ పక్కనబడింది. వర్షాకాలంలో పాత భవనంలో పెచ్చులూడిపడుతుండటంతో మూడేళ్ల కిందట మరోసారి నూతన నిర్మాణంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. పాతభవనాన్ని తొలగించకుండా.. ఆ పక్కనే ఖాళీ స్థలంలో 8 అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే వారసత్వ భవనం పక్కన అంతకంటే ఎత్తులో మరో భవనాన్ని నిర్మించకూడదనే నిబంధన అడ్డంకిగా నిలవడంతో ఆ ప్రతిపాదన కూడా అటకెక్కింది. ఎనిమిది అంతస్తులకు అనుమతి పొంది, కనీసం నాలుగు అంతస్తుల్లోనే నిర్మించాలనే మరో ప్రతిపాదన కూడా రెండేళ్ల కిందట తెరపైకి వచ్చింది. అదీ ఆచరణలోకి రాలేదు. దీంతో పాత భవనానికి మరమ్మతులు చేయాలని గతేడాది ప్రతిపాదించారు. ఇందుకోసం ఆగాఖాన్ ట్రస్టుకు బాధ్యతలు అప్పగించేందుకు రూ.19.2 కోట్లను మంజూరు చేశారు. ఆ ప్రక్రియా ఆగింది.
కొవిడ్‌తో కొత్త కష్టాలు
ఏటా వర్షాకాలంలో ఉస్మానియాలో రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఈసారి కరోనా రూపంలో కొత్త కష్టం ముంచుకొచ్చింది. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించడంతో.. అక్కడికి వెళ్లే సాధారణ రోగులు కూడా ఉస్మానియాకే వస్తున్నారు. దీంతో రోగుల తాకిడి పెరిగిపోయింది. పైగా ఇక్కడ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లున్న రోగులను చేర్చుకొని చికిత్స అందిస్తుండడం, వారిలో కొందరికి కొవిడ్‌గా నిర్ధారణ అవుతుండడంతో ఇక్కడి రోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికితోడు ఇప్పుడు వరదల రూపంలో ముంచెత్తుతున్న కష్టాలు రోగులను బెంబేలెత్తిస్తున్నాయి.
గూడు కరవైంది.. వైద్యమూ దూరమైంది
హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం దయనీయ స్థితి ఇది.. భర్త హోటల్‌లో, భార్య ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కరోనా మహమ్మారి వారి ఉపాధిపై దెబ్బకొట్టడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇల్లు అద్దె చెల్లించకపోవడంతో యజమాని వారిని ఖాళీ చేయించాడు. ఇంతలో భర్త అనారోగ్యానికి గురికావడంతో ఉస్మానియా దవాఖానాలో భార్య చేర్పించింది. బుధవారం కురిసిన వర్షానికి ఆసుపత్రిలోకి భారీగా నీళ్లు రావడంతో రోగుల్లో చాలామంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వీరికి గూడు సైతం లేకపోవడంతో.. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, ఇద్దరు చిన్నారులను తీసుకొని ఆ మహిళ ఆసుపత్రి ఆవరణలోని కారు పార్కింగ్ షెడ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ అక్కడే తలదాచుకుంటున్నట్లు ఆమె వివరించింది.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!