విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, ఆమె పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ స్పష్టం చేశారు. విజయశాంతిని తామంతా ఎంతో గౌరవిస్తామని, కరోనా కారణంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ని ఆమె కలువలేక పోయినట్లు వివరించారు. ఇవాళ పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతితో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ భేటి అయ్యారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతిని కలిసినట్టు తెలుసుకుని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, విజయశాంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని విజయశాంతి చెప్పారని, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వగానే ఆమె కాంగ్రెస్లో చేరారన్నారు. విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు అంటే ఎంతో గౌరవమని, ఆమెను ఎవరు కలిసినా అది మర్యాద పూర్వకంగా కలవడమేనని కుసుమకుమార్ వివరించారు. విజయశాంతి కాంగ్రెస్ను వీడిపోరన్నారు. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిపారు.
ఇవీ చూడండి: పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడండి: నిరంజన్ రెడ్డి