భాజపా మతం, కులం పేరుతో రెచ్చగొట్టే రాజకీయం చేస్తుందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(congress working president jaggareddy) ధ్వజమెత్తారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ చట్టాల(agri laws)తో రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఉత్తరభారతంలో 200రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే భాజపా ప్రభుత్వంలో చలనం రాదా అని ప్రశ్నించారు. కులవృత్తులను కూడా కార్పొరేట్ శక్తులకు భాజపా కట్టబెడుతుందని విమర్శించారు. మనందరిలో ఐకమత్యం తెచ్చేందుకు పూర్వీకులు పండుగలు తీసుకొస్తే భాజపా ఇదే పండుగల పేరుతో మనల్ని విడగోడుతుందని మండిపడ్దారు. ప్రియాంక గాంధీ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే అరెస్టు చేయడమేంటని.. ఇదేమి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రియాంకగాంధీని సాయంత్రంలోగా వెంటనే విడుదల చేయకపోతే తామంతా రోడ్ల మీదికి రావాల్సి ఉంటుందని... సంగారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని జగ్గారెడ్డి(jaggareddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రెండు రాష్ట్రాల్లో పంటలకు గిట్టుబాటు ధర లేదు, నష్టపరిహారం లేదు, రైతురుణమాఫీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఇట్ల ఉన్నది. రైతుదీక్ష చేద్దామన్నా, రైతు ర్యాలీ తీద్దామన్న 1000 మంది మేము ఉంటే.. 2వేల మంది పోలీసులను పెడుతున్నరు. పోలీసులు ఎంత అణగదొక్కాలని చూసి రాహుల్ గాంధీ ఆగరు. మోదీ ప్రధాని అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో అనే ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. ఒక ఎమోషనల్ పాలిటిక్స్.. అంటే మతపరమైన వ్యవస్థతో కూడి రాజకీయాన్ని నడిపించడం జరుగుతోంది. ఓ దిక్కేమో రైతేరాజు అంటూనే.. మరొక దిక్కు చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచేస్తున్నరు. -జగ్గారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చదవండి: లఖింపుర్ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి