Congress Vijayabheri Yatra Postponed in Telangana : తెలంగాణ కాంగ్రెస్(Congress) ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం భువనగిరి పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్వహించాల్సి ఉంది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని తరువాత తెలియచేస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Congress Bus Yatra Stopped Tomorrow : అనివార్య కారణాల వల్లనే వాయిదా వేసినట్లు చెబుతున్నప్పటికీ.. టికెట్ రాని నాయకులు తీవ్రంగా అసంతృప్తితో ఉండడం.. కొందరు పార్టీకి రాజీనామాలు చేయడంతో.. ముందు వాటిని నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్య అతిథి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Congress Bus Yatra Details : విజయభేరి బస్సు యాత్ర మొదటి దశ అక్టోబర్ 15 తేదీ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా వచ్చి.. విజయవంతంగా ఈ యాత్ర సాగింది. రెండో దశ ఈ నెల 28న వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నుంచి ప్రారంభమయింది. దీనికి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇవాళ సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగింది. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) హాజరయ్యారు.
Mallikarjun Kharge Meeting No people in Sangareddy : సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల కార్నర్ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు చేదు అనుభవం ఎదురైంది. ఖర్గే మాట్లాడుతుండగానే భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు వెనుదిరిగి వెళ్లిపోయారు. జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినకుండా.. వెళ్లిపోవడంతో సమావేశంలోని కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి.
Congress Vijaya Bheri Yatra in Sangareddy : ఖర్గే ప్రసంగం ముగింపునకు 20 నిమిషాల ముందే కార్యకర్తలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. నేతలు ఎంత బతిమాలినా వినిపించుకోకుండా పెడ చెవిన పెట్టారు. నాయకుల్లో తొలిత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మాట్లాడినంత వరకు అక్కడికి వచ్చిన జనం ఉర్రూతలూగుతూ ఈలలు వేస్తూ సందడి చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రసంగం ముగిసిన తర్వాత మెల్లగా సభాప్రాంగణం నుంచి వెనుదిరిగారు. దాదాపు 40 వేల మంది సమావేశానికి హాజరయ్యారు. తొలుత కుర్చీలు సరిపోక కింద కుర్చున్నారు. కానీ ఖర్గే ప్రసంగం మెుదలైన దగ్గర నుంచి ప్రజలు తిరిగి వెళ్లిపోవడం మొదలు పెట్టారు. ఆ 20 నిమిషాల పాటు ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించి ముగించుకుని అక్కడి నుంచి మెదక్ సమావేశానికి వెళ్లిపోయారు.