హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. భాజపా అభ్యర్థిపై.. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి 1,272 ఓట్ల తేడాతో గెలుపొందారు. లింగోజిగూడ డివిజన్‌లో విజయం సాధిచండతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది. బల్దియా ఎన్నికల్లో భాజపా నుంచి పోటీచేసి విజయం సాధించిన రమేశ్‌గౌడ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. రమేశ్ గౌడ్ మృతితో ఆ డివిజన్‌ను ఏకగ్రీవం కోసం భాజపా యత్నించింది. ఆ పార్టీ నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిసి... లింగోజిగూడ డివిజన్‌లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిని నిలపమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒప్పించేందుకు భాజపా నేతలు యత్నించినా... లాభం లేకపోయింది. అభ్యర్థిని వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగ్గా... ఇవాళ లెక్కింపు చేపట్టారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 49,203 ఓట్లకు గాను... కేవలం 13,591 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 38 ఓట్లతో కలిపి మొత్తం 13,629( 28 శాతం) మాత్రమే పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లలో 33 కాంగ్రెస్‌కు, 5 చెల్లని ఓట్లు ఉన్నాయి. 101 నోటాకు, 188 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వరదల సమయంలో లింగోజిగూడ దాదాపుగా పూర్తిగా ముంపునకు గురయింది... ఈ నేపథ్యంలో ఇక్కడ ఆస్తి పన్ను మాఫీకి పోరాడటంతో పాటు.. ఇతర అంశాలను ప్రధానంగా ప్రస్తావించి కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డికి గెలుపు పత్రం అందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన లేదు: జానారెడ్డి