తెలంగాణలో కొవిడ్-19 కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నట్లు ఐసీఎంఆర్ అనుమతులు కలిగిన ప్రైవేటు ఆస్పత్రుల్లో, ప్రయోగశాలల్లో కరోనా పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని స్వాగతించింది.
కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొవిడ్-19 కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిల సంతకాలతో లేఖ రాశారు. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకునే వారందరికి ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలన్నారు. అందుకు అయ్యే మొత్తం ఖర్చును ఆయా ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు యాభై వేలకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. ఇటీవల సుప్రీంకోర్టు పరీక్షలను ఉచితంగా చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. ఆ మేరకు తెలంగాణలోనూ అమలయ్యేట్లు చూడాలని కోరింది. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రజలు వ్యక్తిగత రక్షణపై దృష్టిసారించడం తగ్గినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలకు, పర్యటనలకు వెళ్లడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
సౌకర్యాలు లేకపోవడం
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయడానికి సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అక్కడ కూడా నమూనాల సేకరణకు తక్షణం ఏర్పాట్లు చేసేట్లు చూడాలని కమిటీ కోరింది. కొవిడ్ రోగులు కానీ వారికి వైద్యం సక్రమంగా అందక ప్రాణాలు పోతున్న సందర్భాలు ఉన్నందున. దీనిని అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది.
ఇదీ చూడండి : 'రవీంద్రభారతి కన్నా కాళోజీ కళాక్షేత్రమే అద్భుతంగా ఉంటుంది'