Congress Special Focus on MLC Candidates Selection : రాష్ట్రంలో మండలి సభ్యుల ఎంపిక కోలాహలం మొదలైంది. ఆరు ఎమ్మెల్సీలకు అభ్యర్థుల ఎంపికపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కసరత్తు చేస్తున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులయ్యే నాయకులు ఏదో ఒక రంగంలో సమాజ సేవ చేసిన వారై ఉండాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ కోటా కింద ఇద్దరి పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ వాటిని తిప్పి పంపారు.
దీంతో కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే ముందు అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఇందువల్లే గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులకు ఒకరిగా, ప్రొఫెసర్‌గా విద్యాసేవలు అందించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, రెండో ఎమ్మెల్సీ ప్రముఖ విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్‌కు కానీ, మస్కతి డైరీ యజమాని మస్కతికి కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
MLC Elections in Telangana 2024 : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రెండు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిలు డిసెంబర్ 9వ తేదీన తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఆ రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
ఈ రెండు స్థానాల పదవీ కాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం, రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. రెండు నోటిఫికేషన్లకు అనుగుణంగా విడివిడిగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. శాసనసభ్యుల బలాబలాలను బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరగనుండడంతో ఆ రెండు కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి.
Telangana MLA Quota MLC by Election 2024 : ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో, ఓసీలైతే సూర్యాపేట టికెట్ త్యాగం చేసిన పటేల్ రమేశ్‌రెడ్డి, పార్టీ విధేయుడిగా ముద్రపడి ప్రోటోకాల్ ఛైర్మన్‌గా, 2018లోనే ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అధిష్ఠానం నుంచి హామీ పొందిన హర్కర్ వేణుగోపాల్ రావు, బీసీలకైతే మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలు క్యూలో ఉన్నారు. మైనారిటీ కోటా కింద ఏఐసీసీ మైనారిటీ సెల్ కార్యదర్శి ఫయూమ్ ఖురేషి, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్, మస్కతి డైరీ యజమాని మస్కతిలు ఆశావహులుగా ఉన్నారు.
నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ - రెండు సీట్లు కాంగ్రెస్‌కే!
ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్‌లు ఉన్నారు. ఎన్నికల బరిలో నిలబడి దక్కించుకోవాల్సిన రెండు ఎమ్మెల్సీలకు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తున్న పేర్లు స్థానిక సంస్థల కోటా కింద మాజీ మంత్రి చిన్నారెడ్డి, గ్రాడ్యుయేషన్ కోటా కింద తీన్మార్ మల్లన్నలను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇంతకంటే బలమైన నాయకులు పోటీకి చొరవ చూపినట్లయితే అభ్యర్థులు మారే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు సంక్రాంతిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవుల ఎంపికలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే స్వయంగా సీఎంనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో పాటు అధికార బృందం పెట్టుబడులను ఆకర్శించేందుకు ఈ నెల 14వ తేదీన దావోస్ వెళ్లుతుండడంతో అప్పటికి కొన్నింటిపై కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!