Jaggareddy statement: తాను ఏం మాట్లాడిన పార్టీ మంచి కోసమే మాట్లాడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. రాజకీయ రణరంగంలో అనేక వ్యూహాలు ఉంటాయని పేర్కొన్నారు. తాను ఏది మాట్లాడినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మాట్లాడతానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఏం మాట్లాడినా కాంగ్రెస్ భవిష్యత్తు కోసమే. అప్పట్లో రాష్ట్ర విభజనను నేను ఒక్కడినే వ్యతిరేకించా. సంగారెడ్డికి కేసీఆర్ రావొద్దని ధర్నాలు చేసినా. రాజకీయంలో అనేక వ్యూహాలు ఉంటాయి. ఇదొక వ్యూహం అనుకోండి. మూడు రోజులు భాజపా సమావేశాలను టీవీల్లో చూపారు. ఆ రోజే యశ్వంత్ సిన్హాను కేసీఆర్ ఆహ్వానించడం అంతా ఒక వ్యూహం. మేం ప్రజల కోసం ఎంత పనిచేస్తున్నా మమ్మల్ని గుర్తిస్తలేరు. భాజపాది ఎత్తుగడ.. కేసీఆర్‌ది పైఎత్తుగడ. ఇందులో నాది కూడా ఎత్తుగడే.- జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేను పార్టీ నుంచి పోవాలనుకుంటే నన్ను ఆపేదెవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అందుకే వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. త్వరలొనే మళ్లీ అన్ని విషయాలు మాట్లాడతానని స్పష్టం చేశారు. నేను ఎవ్వరికి భయపడనని.. నేను అనుకున్నదే మాట్లాడతానని జగ్గారెడ్డి వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఒక్కడినే కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. నాపై మా పార్టీ నాయకులతోపాటు, ఇతరులు కూడా ఒత్తిడి తెచ్చారని.. అయినా కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని వెల్లడించారు. పార్టీ కోసం అందరితో కలిసి పని చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. రేవంత్‌పై జగ్గారెడ్డి నిప్పులు.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
'అవును! మాది ఈడీ ప్రభుత్వమే.. నన్ను ట్రోల్ చేసినవారిని..'.. ఫడణవీస్ విక్టరీ స్పీచ్