గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కమిటీ సమీక్షిస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా జానారెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్ ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ డిపాజిట్ కోల్పోవడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
ఓటమికి పూర్తి బాధ్యత నాదే
హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపపోరులో హస్తం అభ్యర్థి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పార్టీ సీనియర్లు కొందరు ఈ పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఓటమి దేనికి సంకేతమని బాహాటంగానే ప్రశ్నించారు. సీనియర్ల ఆరోపణలపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువేనని.. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. కార్యకర్తలు నిరాశకు లోనుకావొద్దని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు పార్టీలో స్వచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పిన రేవంత్.. పార్టీ అంతర్గత భేటీలో చర్చించుకొని అందరినీ కలుపుకొనే ముందుకువెళ్తానని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపాలైన బల్మూరి వెంకట్ భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతారని జోస్యం చెప్పారు.
గత ఎన్నికల్లో దాదాపు 62 వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో కేవలం 3,012 ఓట్లు మాత్రమే రావడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఊహించలేదని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్‌లో పరాభవంపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమీక్ష తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: CONGRESS: మళ్లీ అదే సీన్.. కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన హుజూరాబాద్ రిజల్ట్