రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన తమిళనాడుకు చెందిన ఎంపీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి మానిక్కం ఠాకూర్ వరుస సమావేశాల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్తేజం తీసుకొస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జూమ్ యాప్ ద్వారా ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో పార్టీకి దూరంగా ఉన్న వారు, స్తబ్దుగా ఉన్న నాయకులు కూడా ఈయన ఇంఛార్జిగా నియామకమైన తర్వాత తిరిగి పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
మొదట పార్టీలో అంతర్గతంగా ఉన్న వ్యవహారాలను చక్కబెట్టేందుకు అధిష్ఠానం పావులు కదుపుతోంది. మానిక్కం ఠాకూర్ జూమ్ యాప్ ద్వారా పార్టీ కోర్‌కమిటీతో పాటు, సీనియర్లు, డీసీసీ అధ్యక్షులతో, నగరపాలక సంస్థల అధ్యక్షులతో విడిగా సమావేశాలు నిర్వహించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై కూడా ఆ ప్రాంతానికి చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీకి తిరిగి పునర్వైభవం రావాలంటే ఏం చేయాలో.... సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఆయా నాయకుల అభిప్రాయాలను తెలుసుకుని పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపట్ల ఉపేక్ష ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు.
గ్రేటర్ ఎన్నికలపై దృష్టి
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్... నాయకులంతా కలిసికట్టుగా ముందుకెళ్తే అధికార పార్టీని ఢీకొట్టడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తోంది. నగరంలోని డివిజన్ల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో ఇప్పటికే డివిజన్ల ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు. డివిజన్ల స్థాయి నుంచి అన్ని పోస్టులను భర్తీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. దీంతో స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం సులువు అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఓటర్ల జాబితా సవరింపుపై స్థానిక నాయకులు గట్టి నిఘా ఉంచాలని... ఎక్కడ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పార్టీ క్యాడర్‌కు స్పష్టం చేసింది.
గెలుపే లక్ష్యంగా
ఇలా ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం వల్ల అధికార పార్టీకి గట్టి పోటీనివ్వొచ్చని... గెలుపే లక్ష్యంగా పని చేసే వాతావరణాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్‌తో కూడిన మరొక బృందం నేరేడ్‌మెట్ వెళ్లి అక్కడ ఇటీవల నాలాలో పడి మృతి చెందిన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు.
ఖమ్మం, వరంగల్ పాగా వేసేందుకు యత్నం
ఖమ్మం, వరంగల్ పురపాలక ఎన్నికల్లో కూడా హస్తం పాగా వేసేందుకు అక్కడ నాయకుల ద్వారా కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని రంగంలోకి దించి... గెలుపునకు అన్ని రకాల కృషి చేయాలని రాష్ట్ర పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్... నల్గొండ, ఖమ్మం, వరంగల్ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి అభ్యర్థులను పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఇదీ చదవండి: ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక