హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సహా నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు... 54 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి గట్టి పోటీ ఉంది. చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ చొరవ చూపుతున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, దాసోజు శ్రవణ్, మానవతారాయ్, కత్తివెంకటస్వామి చొరవ చూపుతున్నారు. దాసోజు శ్రవణ్‌కుమార్ రెండింటిలో ఎక్కడిచ్చినా.... పోటీ చేస్తానని పేర్కొంటూ రెండు దరఖాస్తులు ఇచ్చారు.
దుబ్బాక పోరు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి
ఓటర్ల నాడితోపాటు సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం... తనకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ను కోరారు. కోదండరామ్‌కు మద్దతివ్వడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. ఆయనకు మద్దతివ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు నాయకులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక ముగిసిన తర్వాత ఈ అంశంపై దృష్టిసారించాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి: వరదల ధాటికి హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే..?