ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా ఈటల రాజేందర్‌పై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈటల స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని, పౌల్ట్రీలో ఆయన దశలు దశలుగా ఎదుగుతూ వచ్చారని కొనియాడారు. ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాడని వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌కు కోరిక ఉందని... అదే సమయంలో ఈటల సీఎం పదవికి అర్హుడనే అంశం తెర మీదకు రావడంతో కేసీఆర్‌కు మింగుడు పడలేదని విమర్శించారు. కేసీఆర్ ఆస్తులు, ఈటల ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు కూడా తెలుస్తుందన్నారు.
కేటీఆర్ 111 జీవో ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మాణం చేస్తే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూ కబ్జాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కేసీఆర్ ఓర్వలేని తనంతోనే ఈటలను బలి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌పై కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయని.. ధరణి వెబ్సైట్లో ఫామ్ హౌస్ భూములు ఎందుకు కలిపించడం లేదని ప్రశ్నించారు. విచారణ జరగాలంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్