Jeevanreddy On CM KCR: దేశంలో అత్యంత అసమర్థ, అవినీతి సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు మాట్లాడుతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
తెరాసపై ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీల అమలుకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రానికి మద్దతిచ్చి ఇప్పుడు విమర్శలు చేయడం నీ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కేంద్రంలో మోదీ ఎంత అసమర్థత పాలన కొనసాగిస్తున్నారో ఇక్కడ కేసీఆర్ కూడా అలాగే చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలు తేదీలను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తది. ఆ మాత్రం తెలియదా మీకు? శాసనసభ రద్దు చేసే ధైర్యముందా నీకు? ఇప్పుడు రద్దు చేస్తే గుజరాత్‌తో పాటు ఎన్నికలొస్తాయి. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రద్దు చేస్తారా. దేశంలో ఇంత అవినీతి, అసమర్థ సీఎం ఎవరూ లేరు. - జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి కల్పిస్తున్న రాయితీలన్నీ ఎత్తివేసి రైతుబంధు అమలు చేస్తున్నారని.. చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఉన్న రాయితీలను పునరుద్ధరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అసమర్థ ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.