Jaggareddy Met CM KCR: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లను అసెంబ్లీలో కలిశారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌లకు వినతి పత్రాలు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేసినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో మరోసారి కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
మెట్రో రైలు సంగారెడ్డి జిల్లా సదాశివపేట వరకు విస్తరించాలని, దళిత బంధు తమ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని కోరడంతో పాటు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను పిలిచి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌లను కలవడంలో తప్పేముందని కలిసి వచ్చిన అనంతరం జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎంపీలు ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడు లేని తప్పు.. తాను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌ను కలిస్తే తప్పు ఎలా అవుతుందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తయిన మరుసటి రోజునే కోవర్టర్ అనే ముద్ర వేశారన్న జగ్గారెడ్డి.. ఇప్పుడు కొత్తగా తాను బద్నామయ్యేది ఏముంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: