Congress MLA Candidates 3rd List Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల తర్వాత ఉత్పన్నమైన పరిణామాల దృష్ట్యా మూడో జాబితాపై (MLA Candidates Final List) కసరత్తు.. మరింత పారదర్శకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా 55 మంది పేర్లతో అధిష్ఠానం విడుదల చేసినప్పటికీ పెద్దగా అసంతృప్తి వ్యక్తం కాలేదు. రెండో జాబితా 45మంది పేర్లతో విడుదల చేసిన తర్వాత.. పార్టీని కుదిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది. దీంతో రాజీనామాల పర్వంతో పాటు అసమ్మతి గళం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు అసంతృప్తులు ఉండడంతో వారిని బుజ్జగించడం పార్టీకి కత్తి మీద సాములా మారింది. నష్ట నివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్.. వివిధ మార్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మూడో జాబితాపై హస్తం పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదల అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వామపక్షాలకు కాంగ్రెస్ ఇవ్వాల్సిన నాలుగు సీట్లు కూడా కేటాయించే పరిస్థితులు లేకుండాపోయాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ సీపీఎం మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
Congress MLA Candidates 2023 : మరోవైపు ఇప్పటి వరకు ప్రకటించిన వంద నియోజకవర్గాల్లో కేవలం 20 చోట్ల మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు. అత్యధికంగా రెడ్లకు 38 సీట్లు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు విడుదల చేసిన 100 మంది అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం జరగలేదని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లుపోగా.. మిగిలిన వారిలో బీసీలకు కనీసం నాలుగు టికెట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది.
Telangana Assembly Elections 2023 : అంతకంటే తక్కువ ఇచ్చినట్లయితే ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్.. బీసీల గురించి మాట్లాడేందుకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ కంటే ఒకటి, రెండు సీట్లైనా అదనంగా బీసీలకు ఇచ్చేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏ సమయంలో అయినా మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి.
Telangana Congress MLA Tickets 2023 : ఈ మూడో జాబితాలో నిన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకట స్వామి (Vivek Venkataswamy) కుమారుడు వంశీకి చెన్నూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో చెన్నూరు టికెట్ కూడా వామపక్షాలకు దక్కకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.