లోతైన సమీక్ష తర్వాతనే తుది నిర్ణయం
కొన్ని స్థానాల్లో టీపీసీసీ ప్రతిపాదిత పేర్లు కాకుండా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మొదటి జాబితాలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ను బరిలో నిలిపింది. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించింది. మిగిలిన స్థానాల్లో కూడా సామాజిక వర్గాల ఆధారంగా బలమైన వ్యక్తులుగా భావించిన వారికే టికెట్ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై లోతైన సమీక్ష తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బలమైన అభ్యర్థుల వేటలో కాంగ్రెస్
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదిరి, నామా నాగేశ్వరరావులతో పాటు మరికొందరు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ సీటు ఆశిస్తుండగా అంతకంటే ఎక్కువ బలమైన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూలు నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య టికెట్ తనకే కేటాయించాలని ఒత్తిడి తెస్తుండగా ఆయనకే ఇవ్వాలా లేక మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు ఇవ్వాలన్న అంశం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణను బరిలోకి దించాలని యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ...ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుదరనట్లయితే వంశీచంద్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది.
భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, జానా తనయుడు రఘువీర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగానే... వారిద్దరిని కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలో దింపే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన...తిరిగి ఎన్నికలు జరిగితే ఆ స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలు తక్కువని అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం.
హైదరాబాద్ స్థానం నుంచి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్ పేర్లను పరిశీలించిన అధిష్ఠానం చివరి నిమిషంలో మైనార్టీ సెల్ ఛైర్మన్ సోహెల్ పేరు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్‌తోపాటు సీనియర్ నేతమర్రి శశిధర్ రెడ్డి, అజారుద్దీన్, మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డిలు పోటీ పడుతుండగా అంజన్‌కుమార్ యాదవ్‌కే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం
నిజామాబాద్ స్థానం నుంచి మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ మాజీ ఎంపీ మధుయాస్కీని ఇక్కడ నుంచి బరిలో నిలపాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొమ్మిది పార్లమెంటు నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపికపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: నేటి నుంచే నామపత్రాల స్వీకరణ