కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరగనున్న మినీ పుర ఎన్నికల పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతున్నందున ఎన్నికల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాలు, ఓట్లు లెక్కింపు కేంద్రాలపై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషనే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, ఓటర్లకు చెందిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ స్టేషన్లను ముందు రోజే శానిటైజ్ చేయాలని సూచించారు.
పోలింగ్ సిబ్బంది ఒక రోజు ముందే పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకుంటున్నందున వారికి సౌకర్యవంతమైన వసతి కల్పించాలని, శుభ్రమైన భోజనం అందేట్లు చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరగాలని, ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి ఎండవేడిమి లేకుండా ఉండేందుకు వీలుగా కేంద్రాల వద్ద టెంట్లు వేయాని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆక్సిజన్‌తో కూడిన అంబులెన్స్, వైద్యుడు ఉండేట్లు చూడాలన్నారు. ఇవే చర్యలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మినీ పోల్స్: ఈసారైనా ఖమ్మం ఓటర్లు గుమ్మం దాటుతారా..?