ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మిలియన్‌మార్చ్ కార్యక్రమంలో పాల్గొనకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఖండించారు. ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భావస్వేచ్చ హక్కును హరిస్తోందని ఆరోపించారు.
హక్కులు కాలరాస్తున్నారు...
రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని రాజ్యాంగం కల్పించిన ప్రజాహక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు ధ్వజమెత్తారు. చిన్నచిన్న ఉద్యమాలకు పిలుపునిచ్చినా... ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్వవహరిస్తున్నారన్నారు.
సీఎం రాజీనామా చేయాలి...
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే చేసుంటే తెరాస... పోరాటం సాగించేదా అని ప్రశ్నించారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా... సీఎం కేసీఆర్‌కు బుద్ధి రావడం లేదన్నారు. ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా...సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు కొనసాగిస్తే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'