కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వైద్యులను, నర్సులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలు ఉన్నాయని... వాటిని ఎలాంటి అనుభవం లేని కొత్త వారితో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కొత్తగా నియామాకాలు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని హనుమంతరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగైదేళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
వారంతా పూర్తి స్థాయిలో అనుభవం సంపాదించారని, కరోనా వ్యాప్తి నివారణ కోసం చురుగ్గా, సమర్ధవంతంగా పని చేస్తున్నారని వివరించారు. కొత్తగా నియమించే బదులు....ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వేలాది మంది క్రమబద్దీకరణకు సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరువాత నిధానంగా కొత్తగా వైద్యులను, నర్సులను, మెడికల్ స్టాఫ్ నియామకాలు చేపట్టొచ్చని సూచించారు.
ఇవీ చూడండి: ఛల్లో మల్లారం వెళ్తున్న ఉత్తమ్ కుమార్ అరెస్ట్!