రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్లను నియామకాల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ లౌకికవాదినని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆచరణలో మాత్రం మతపరమైన ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకాల్లోనూ మొండిచేయి చూపారని విమర్శించారు. లాక్‌డౌన్ పేరుతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా ప్రాంతాల్లో మినహాయింపు ఉన్న వారిని కూడా కొట్టారని ఆరోపించారు. మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేయకుండా డీజీపీని అభ్యర్థించే దుస్థితి ఏర్పడిందన్నారు. లాక్డౌన్లో పాసులు ఉండి ఆహారం సరఫరా చేసే వారిని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాధితుల నుంచి అన్యాయంగా స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.