పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పీవీ నర్సింహారావు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాతిస్తున్నామన్నారు. తాము కూడా ఉత్సవాల్లో పాల్గొంటామని తెలిపారు. దక్షిణాదికి చెందిన తొలి ప్రధాన మంత్రి స్వర్గీయ పీవీ నర్సింహారావు జయంతి ఉత్సవాలకు నిధులు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు.
2013లోనే తీర్మానం చేశాం
పీవీకి భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని 2013లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. 2009లోనే హైదరాబాద్‌లో ఆసియాలోనే అతి పెద్ద ఎక్స్ప్రెస్ హైవేకి పీవీ నర్సింహారావు పేరు పెట్టామని చెప్పారు.
ప్రాజెక్టులకు పీవీ పేరు పెట్టాలి
రాజకీయాల్లో తలపండిన పీవీని గుర్తించి అనేక పదవులు ఇవ్వడమే కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడిగా.. దేశ ప్రధానిగా ఆయనకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. స్వర్గస్తులైన దశాబ్దంన్నర తర్వాత పీవీ నరసింహారావును గుర్తించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పీవీపై గౌరవం ఉంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కానీ, ప్రాజెక్టులకు కానీ, జిల్లాలకు కానీ, ఆస్పత్రులకు కానీ పీవీ పేరు పెట్టాలన్నారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?