అధికారం కోసం కాంగ్రెస్ ఎమోషనల్ రాజకీయాలు చేయదని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ భావంతో ప్రపంచ దేశాల సత్సంబంధాలతో నడిచే పార్టీ అని పేర్కొన్న జగ్గారెడ్డి.... రాహుల్ గాంధీపై ఒబమా విమర్శలు చేయడం తగదన్నారు. దేశంలో ఉన్న పరిస్థితులను చూసుకుని ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ఉందన్నారు. దేశం కోసం రాహుల్‌గాంధీ ఎలాంటి ప్రకటన చేసినా అది ఒక శాసనంలాగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీరాముడితోపాటు భాగవతము, బైబిల్, ఖురాన్‌ను గౌరవిస్తుందని తెలిపారు.
రాజకీయ ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలు, ప్రజలు ముఖ్యమని రాహుల్ గాంధీ భావిస్తారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసింది సోనియాగాంధీ, రాహుల్ గాంధీయేనని గుర్తు చేశారు. 2014 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు లేక సగం మంది కాంగ్రెస్ నాయకులను తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు భాజపా కూడా నాయకులు లేక కాంగ్రెస్ నాయకులను తీసుకుంటుందని ఆరోపించారు. నైతికంగా రాహుల్‌గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదన్న జగ్గారెడ్డి... ఒక మాట ఇచ్చినందుకు తెలంగాణ ఇచ్చి రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోయిందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: ఎలాంటి అవకతవకలు లేకుండా రిజిస్ట్రేషన్లు: సీఎస్