Congress Focus On Nominated Posts Telangana : రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న 54 మంది బీఆర్ఎస్ నేతల పదవులను రద్దు చేస్తూ సర్కార్ జీవో జారీచేసింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Congress Focus On Nominated Posts : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులతో కొందరు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు దిల్లీలో మకాం వేసి, ఏఐసీసీ ద్వారా సిఫార్సులు చేయించుకుంటున్నారు. ముఖ్యమైన కార్పొరేషన్లైన ఆగ్రో ఇండస్ట్రీస్, రైతుబంధు సమితి, మార్క్‌ఫెడ్, కో-ఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్‌మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్, ప్రెస్ అకాడమీ, పవర్‌లూం, టెక్స్‌టైల్స్, వర్క్ బోర్డ్, బేవరేజస్ కార్పొరేషన్, ఆర్టీసీ తదితర కీలకమైన నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Congress Senior Leaders Hopes On Nominated Posts : శాసనసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకోగా సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసినందున చాలా మంది సీనియర్లకు సైతం టికెట్లు దక్కలేదు. పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మినహా, ఎవరికీ టికెట్లు దక్కలేదు.
టికెట్లు దక్కని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో సమన్వయ కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని వారితో భేటీలు జరిగిన ఈ కమిటీ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయంతో టికెట్లు దక్కని వారి చూపు నామినేటెడ్ పోస్టులపై పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని పదవులు దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
పదవుల కోసం పైరవీలు ముమ్మరం - దిల్లీలో మకాం వేసి ఏఐసీసీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, ప్రోటోకాల్ ఛైర్మన్ వేణుగోపాల్‌రావు తదితరులు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు.
Congress Focus on Nominated Posts in Telangana : వీరితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, భవానీరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డితో పాటు చిలుక మధుసూధన్‌రెడ్డి, కైలాశ్‌నేత, చారకొండ వెంకటేశ్, లోకేశ్‌యాదవ్, మీడియా కో-ఆర్డినేటర్లుగా పనిచేసిన బురకా వచన్‌కుమార్, కె.శ్రీకాంత్ యాదవ్‌లు ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే పీసీసీ కార్యవర్గానికి చెందిన జాబితాను తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ కోసం కష్టపడిన వారిని పరిశీలించినట్టు తెలుస్తోంది.
టికెట్ త్యాగం చేసిన నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశం కల్పించాలన్న యోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదికన అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులకు సీఎం సూచించారు. నెల రోజుల్లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినందున జాబితాలు సిద్ధం చేసే పనిలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్‌లు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా?
ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టాం - అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు