కరోనా మహమ్మారిని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు ముడి పెట్టడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర పాలకవర్గాలు అభిప్రాయపడ్డాయి. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్, పీసీసీ అధికార ప్రతినిధి ఇందిర శోభన్‌లు ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొందరపాటు చర్యగా అభివర్ణించిన వారు.. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయం.. 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి... ఇప్పుడు పెన్షన్‌పై ఆధారపడి జీవనం గడుపుతున్న వృద్ధులకు తీవ్రమైన మానసిక క్షోభ కలిగిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు వస్తున్న చాలీచాలని పెన్షన్లలో 50శాతం కోత విధిస్తే... వాళ్లు మందులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి డబ్బులు సరిపోక నానా అవస్థలు పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని సేవ చేస్తున్న వైద్యులకు, నర్సులకు బోనస్ ఇవ్వాల్సింది పోయి జీతాల్లో కోత పెట్టి నిరుత్సాహ పరచడం సరికాదన్నారు. కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసు వ్యవస్థకు ఆర్థిక మనోబలాన్ని ఇవ్వాల్సింది పోయి వేతనాల్లో కోత విధించడం ఏంటని నిలదీశారు.
ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు