తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళిత... గిరిజనుల లాకప్ డెత్‌లు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరియమ్మ లాకప్ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వారు కోరారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రితంలు గవర్నెర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేశారు. అడ్డగూడూరు ఠాణా ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
మరియమ్మ లాకప్ డెత్‌కి కారణం అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. తల్లిదండ్రులు లేని ఆ కుటుంబానికి భూమి, ఆర్థిక సాయం ఇవ్వాలని కోరినట్లు భట్టి తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనుల లాకప్ డెత్‌లు పెరిగాయని విమర్శించారు. దళిత, గిరిజనులకు బతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరియమ్మది పోలీసు హత్యానా, ప్రభుత్వ హత్యానా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులే హింస చేస్తే ఎవరికీ చెప్పుకోవాలని నిలదీశారు. గతంలో మంథనిలో లాకప్ డెత్ జరిగినా చర్యలు లేవన్నారు. పోలీసు యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగం వాడుకుంటుందని విమర్శించారు.
రాష్ట్రంలో కొంత మంది పోలీసుల తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోస్టింగుల కోసం తెరాస కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హోమంత్రి, డీజీపీ ఉన్నారో లేదో తెలియడం లేదని ఆరోపించారు. పోలీసులు కొన్ని చోట్ల కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు కొందరు డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని కూడా వెనకేసుకువస్తున్నారని వెల్లడించారు.
అసలేం జరిగింది
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల కస్టడీలో మరియమ్మ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోలీసులపై వేటు పడింది. అడ్డగూడూరు ఠాణా ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్(cp mahesh bhagwat) ఉత్తర్వులు జారీచేశారు. దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసుల కస్టడీలో ఉన్న మరియమ్మ ఈ నెల 11న అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.
ఈ వ్యవహారంలో ఆ ఠాణా పోలీసులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీపీ మహేశ్ భగవత్.. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌ను కేసు విచారణాధికారిగా నియమించారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఠాణాలో మహిళకు సరైన రక్షణ కల్పించడంలో అలసత్వం వహించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: Petrol price Hike: కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన