Congress Alliance With CPI Confirmed : తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐల మద్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటుతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేట్లు ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇవాళ సీపీఐ కార్యాలయానికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్సీలు.. సీపీఐ నాయకులు నారాయణ(CPI Leader Narayana), కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు పలు రాజకీయ ఆంశాలపై చర్చించారు.
Congress Allots Kothagudem seat to CPI : ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ నాయకులు నారాయణ, కూనంనేనిలు చర్చల సారాంశాన్ని వివరించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాను సీపీఐ కార్యాలయానికి వచ్చి.. ఆ పార్టీ నాయకులతో చర్చలు జరిపినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తర్వాతే తాము ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీతో కలిసి పని చేస్తారని వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రెండు ఎమ్మెల్సీలు సీపీఐకి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. తమకు రాజకీయంగా ఉండే ఒత్తిళ్లు గురించి సీపీఐ నాయకులకు వివరించినట్లు తెలిపారు. నెల రోజుల కిందట నిశ్చితార్థం అయిందని.. ఇవాళ పెళ్లి ముహూర్తం కుదిరిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
'సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖాయమైంది. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేయబోతోంది. కొత్తగూడెంలో సీపీఐ విజయం కోసం కృషి చేస్తాం. ఎన్నికల తర్వాత సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాం. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీ వేస్తాం. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సీపీఐతో చర్చలు జరిపాం. అనేక దఫాలుగా ఈ చర్చలు జరిగాయి. సీపీఐతో ఒక ఒప్పందానికి వచ్చాం. మోదీ వల్ల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది. ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన అవసరం వచ్చింది.' -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
నన్ను గెలిపిస్తే కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తా : రేవంత్ రెడ్డి
Revanth Reddy Visit CPI Party Office in Hyderabad : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పాలన బాగుందన్న నారాయణ.. బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్ మూడు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. బండి సంజయ్‌కు బండి కట్టి ఇంటికి పంపారని విమర్శించారు. కేసీఆర్ పోకడకి వ్యతిరేఖంగా పోరాడడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు అనివార్యమైనట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి ఇతర పార్టీలు కృత్రిమంగా నడుచుకుంటున్నాయని ఆరోపించారు.
Alliance Confirms Between Congress And CPI Party : ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని.. కానీ బీఆర్‌ఎస్ ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిందని కూనంనేని విమర్శించారు. సీపీఎంతో కూడా ఏదొక విధంగా అవగాహన వస్తుందని ఇప్పటి వరకు తాము భావించామని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కూడా ఈ స్నేహం ఇలానే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.
ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు